నవవధువు అనుమానాస్పద మృతి

8 Jun, 2020 07:49 IST|Sakshi
భర్త సురేష్‌తో గీతాంజలి (ఫైల్‌)

సాక్షి, పుట్టపర్తి ‌: వెంగళమ్మచెరువు గ్రామంలో నవ వధువు గీతాంజలి (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కట్నం కోసమే చిత్రహింసలు పెట్టి చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు మెట్టినింటి వారిపై ఫిర్యాదు చేశారు. రూరల్‌ సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, పుట్టపర్తి, కొత్తచెరువు ఎస్‌ఐలు దాదాపీర్, వెంకటేశ్వర్లు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముదిగుబ్బకు చెందిన బొగ్గు కుళ్లాయప్ప, అలివేలమ్మ దంపతుల పెద్ద కుమార్తె గీతాంజలిని ముదిగుబ్బలోనే నివాసముంటన్న బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి చెందిన ముసలప్ప, గంగమ్మ దంపతుల కుమారుడు అయిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సురేష్‌కు ఇచ్చి ఆరు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.1.5 లక్షలు కట్నం కింద అందజేశారు. అయితే తమకు అదనంగా మరో రూ.లక్ష కావాలంటూ మెట్టినింటి వారు వేధించేవారు.

నవదంపతులు శనివారం ఉదయం గంగిరెడ్డిపల్లి ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చి సాయంత్రం వెంగళమ్మచెరువులోని సురేష్‌ చిన్నాన్న చిన్నప్పయ్య ఇంటికి చేరుకున్నారు. చిన్నప్పయ్యకు చెందిన నూతన ఇంటిలో వారికి పడక ఏర్పాటు చేశారు. పొద్దుపోయిన తరువాత సురేష్‌ తన ముగ్గురు మిత్రులతో కలిసి పూటుగా మద్యం తాగాడు. ఇదే సమయంలో గీతాంజలి తన తల్లికి ఫోన్‌ చేసి తనకు భయమేస్తోందని, ఎవరో నలుగురు వ్యక్తులు ఇంట్లోకి వచ్చారని ఏడుస్తూ చెప్పింది. ఇంతలో సురేష్‌ ఫోన్‌ అందుకుని ‘ఏమీ లేదులే అత్తా.. నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చి పెట్టేశాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే గీతాంజలి ఉరికి వేలాడుతోంది. సురేష్‌ ఇంటి బయటకు వచ్చి కేకలు వేశాడు. ఇరుగుపొరుగు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి, కొత్తచెరువు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. చదవండి: నెల రోజుల క్రితం వివాహం.. కొద్ది రోజులకే 

మృతిపై అనుమానాలు.. 
ఆదివారం ఉదయం కుమార్తె మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో వెంగళమ్మచెరువు చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న గీతాంజలిని చూసి బోరున విలపించారు. కంటి పక్కన, కుడి కాలిపైన, గొంతుకింద, గాయాలతో పాటు చేయి విరిగిన ఆనవాళ్లు ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తన అల్లుడు, వారి మిత్రులు, అతడి చిన్నాన్న కుటుంబ సభ్యులు కలిసి చిత్రహింసలు పెట్టి గీతాంజలిని చంపి.. తర్వాత ఉరివేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని గ్రామంలోని ఉన్నత పాఠశాల వద్ద గంటపాటు రాస్తారోకో చేశారు. పోలీసులు కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి బొగ్గు కుళ్లాయప్ప ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. చదవండి: పురుగుల మందు తాగి టిక్‌టాక్  

మరిన్ని వార్తలు