హర్షవర్ధన్‌ను విచారించిన ఎన్‌ఐఏ

21 Jan, 2019 03:56 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో కీలకంగా భావిస్తున్న ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు విచారించారు. గత ఏడాది అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కత్తి దూసి హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు ఫ్యూజన్‌ఫుడ్స్‌లో పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ రెస్టారెంట్‌ కేంద్రంగానే కుట్ర జరిగిందనేది అందరూ అనుమానించినా.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు హర్షవర్ధన్‌ జోలికే వెళ్లలేదు.

సీఎం చంద్రబాబు కుటుంబానికి సన్నిహితుడైన హర్షవర్ధన్‌తో కనీసం మాట్లాడేందుకు సాహసించలేదు. అయితే ఎన్‌ఐఏ నోటీసులు అందుకున్న తర్వాత హర్షవర్ధన్‌ పత్తాలేకుండా పోయారు. ఇదే విషయమై సాక్షిలో వార్త వచ్చిన దరిమిలా.. తనకు యాక్సిడెంట్‌ అయి ఇంట్లోనే కదల్లేని స్థితిలో ఉన్నానని ఎన్‌ఐఎ అధికారులకు హర్షవర్ధన్‌ సమాచారమిచ్చారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులే రెండు రోజుల కిందట గాజువాకలోని అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆయన చెప్పిన వివరాలను మొత్తం రికార్డు చేశారు. శ్రీనివాసరావు ఎలా పరిచయం, ఎన్‌వోసీ లేకుండా ఎలా ఉద్యోగంలోకి తీసుకున్నారు. అతను రెస్టారెంట్‌లోనే కత్తులు దాచినా ఎందుకు గమనించలేదని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు