కలకలం సృష్టిస్తోన్న ఎన్‌ఐఏ సోదాలు

20 Apr, 2019 10:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు దాక్కున్నారనే అనుమానంతో పలువురి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి పలు ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కోణంలో 8 మంది అనుమానితుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఈ మేరకు కింగ్స్‌ కాలనీలో భారీగా పోలీసులు మోహరించారు. 

గతంలో పట్టుబడ్డ బాసిత్‌ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పక్కా ఆధారాలతోనే అనుమానితులను ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మాడ్యుల్‌ ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన యువకులు ఢిల్లీలో భారీ విధ్వంసాలకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం​ ముగ్గురు ఐసిస్‌ ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఉగ్రదాడి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం వారు రసాయనాలను, డబ్బులను సమకూర్చుకుంటున్నారు. గతంలోనే.. ఢిల్లీలోని ఆర్‌ఎస్సెస్‌ నాయకుడి హత్యకు కుట్రలు పన్నారని.. ఈమేరకు వారికి ఐసిస్‌ నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది.

ఆర్‌ఎస్సెస్‌ నాయకుడి హత్యకు ఢిల్లీ వెళ్లిన బాసిత్‌, నలుగురు యువకులకు ఏకే 47లను ఐసిస్‌ సమకూర్చింది. ఢిల్లీలో ఆ నలుగురు యువకులను అరెస్ట్‌ చేయడంతో.. ప్లాన్‌ విఫలమైంది. దీంతో బాసిత్‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చేశాడు. హైదరాబాద్‌లో బాసిత్‌ పాటు మరో ఇద్దరిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఒకరిని అదుపులోకి..
ఉదయం నుంచి ఎన్‌ఐఏ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఓ యువకుడి (తహన్‌)ని అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తహన్‌ను గచ్చిబౌలిలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు