శ్రీనివాసరావు బెయిల్‌ రద్దు చేయండి

20 Jun, 2019 05:10 IST|Sakshi

బెయిల్‌ కారణాలు చెప్పనేలేదు

హైకోర్టును కోరిన ఎన్‌ఐఏ స్పెషల్‌ పీపీ సిద్ధిరాములు

సాక్షి, అమరావతి: గత ఏడాది వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన జె.శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జి.సిద్ధిరాములు బుధవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే శ్రీనివాసరావుకు ఎన్‌ఐఏ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని తెలిపారు.

ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న విషయాన్ని కింది కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. అసలు బెయిల్‌ మంజూరుకు కారణాలు కూడా తెలియచేయలేదన్నారు. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వచన పరిధిలోకి వస్తుందని, ఈ చట్టంలోని సెక్షన్‌ 6ఏ ప్రకారం బెయిల్‌ మంజూరుకు కారణాలు చెప్పడం తప్పనిసరని ఆయన వివరించారు. ఆ తరువాత శ్రీనివాసరావు తరఫు న్యాయవాది మట్టా జయకర్‌ వాదనలు వినిపించారు.

>
మరిన్ని వార్తలు