వాస్తు పూజల పేరిట మోసం

27 Aug, 2019 08:21 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ మహేందర్‌

 తొమ్మిది మందిపై కేసు నమోదు

సాక్షి, చేర్యాల(సిద్దిపేట): వాస్తు పూజలు చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని చెప్పి మోసం చేసిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్‌ ఏసీపీ ఎస్‌.మహేందర్‌ తెలిపారు. సోమవారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రఘుతో కలిసి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తిరుగుతూ జాతకాలు, వాస్తు పూజలు చేస్తూ జీవనం సాగించే సిరిసిల్ల జిల్లా చీర్లవంచకు చెందిన గందం జంపయ్య ఈ నెల 17న మండల పరిధిలోని ఆకునూరుకు చెందిన జక్కు నర్సింహులు ఇంటికి వచ్చి మీ ఇంట్లో శక్తులు ఉన్నాయని, వాటిని తీసివేస్తే మీకు అంతా మంచి జరుగుతుందని నమ్మించి రూ.46 వేల విలువైన పూజ సామను (స్వర్ణభస్మం) తీసుకుని మరుసటి రోజు మరో ఇద్దరు వ్యక్తులతో వచ్చి ఊదు పొగ వేసి మంత్రాలు చదివినట్లు చేసి మరో రూ.10 వేలు, ఒక గొర్రె పిల్లను తీసుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న నర్సింహులు కుమారుడు ఈ నెల 23న చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో సోమవారం కొందరు వ్యక్తులు మారుతీ కారులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వేములవాడకు చెందిన బూర రాజును అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారి నుంచి రూ.55 వేలు నగదు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ విషయంలో చీర్లవంచకు చెందిన గందం నీలయ్య, టేకు దుర్గయ్య, కడమంచి లింగమయ్య, బూర రాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసును త్వరగా విచారణ చేసి నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ మోహన్‌బాబు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.


 

మరిన్ని వార్తలు