తిలా పాపం.. తలా పిడికెడు!

24 Jun, 2020 12:08 IST|Sakshi
ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేసిన తొమ్మిది మంది నిందితులు

నిధుల దుర్వినియోగం కేసులో తొమ్మిది మంది అరెస్టు

బీసీ కార్పొరేషన్‌లో రూ.50.10 లక్షలకుపైగా దుర్వినియోగం  

ఒంగోలు: బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఆదరణ కార్యక్రమం కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగమైన కేసులో ఎట్టకేలకు పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఇంకో మహిళ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కాకపోవడంతో ఆమెను అరెస్టు చేయలేదు. 2019 అక్టోబర్‌ 21న కలెక్టర్‌ డాక్టర్‌ పోల భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

గతంలోకి వెళ్తే..
నాగముని బీసీ కార్పొరేషన్‌ ఈడీగా బా«ధ్యతలు చేపట్టి రోజులు గడుస్తున్నా సిబ్బంది మాత్రం క్యాష్‌ బుక్‌ అందజేయడం లేదు. దీంతో ఆయన గట్టిగా ప్రశ్నించడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెక్కులు అయితే డ్రా చేశారని, వాటికి సంబంధించిన బిల్లులు అందజేయలేదని సెలవిచ్చారు. పెద్ద మొత్తంలో నిధులు డ్రా చేయాలంటే తప్పనిసరిగా ప్రొసీడింగ్స్‌ ఉండాలని, వాటిని చూపించాలని కోరారు. వాటిని కూడా చూపక పోవడంతో ఆయన కలెక్టర్, బీసీ కార్పొరేషన్‌ ఎండీ రామారావుకు ఫిర్యాదు చేశారు. నిధులు దుర్వినియోగమై ఉండొచ్చని భావించి ప్రధాన కార్యాలయంలో పనిచేసే జి.భీమశంకరరావును విచారణ చేయాలని ఈడీ కోరారు. దీంతో ఆయన జిల్లాకు చేరుకుని మొత్తం విచారించి రూ.50.10 లక్షలకు సంబంధించి ఎటువంటి లెక్కలు లేవని తేల్చారు. అదే నివేదికను ఆయన బీసీ కార్పొరేషన్‌ ఎండీకి అందజేశారు. కలెక్టర్‌కు ఆ నివేదికను పంపి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎండీ సూచించారు.

కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎండీ రామారావు నివేదిక ప్రకారం అప్పటి బీసీ కార్పొరేషన్‌ ఈడీగా ఉన్న నాగేశ్వరరావు పేరున రూ.9 లక్షలు, ఏఈవో అంబటి శ్రీనివాసరావు పేరున రూ.8.05 లక్షలు, డీబీ సీడబ్ల్యూవో పీవీ ఆంజనేయులు పేరున రూ.45 వేలు, జూనియర్‌ అసిస్టెంట్‌ (ఔట్‌ సోర్సింగ్‌) ఏడుకొండలు పేరున రూ.11,48,500, కాపు కార్పోరేషన్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (ఔట్‌ సోర్సింగ్‌) వి.రాజేష్‌ పేరున రూ.8.90 లక్షలు, మరో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (ఔట్‌ సోర్సింగ్‌) బీవై కమలేశ్వరరావు పేరున రూ.10,02,500లు, దోర్నాల మండలం యడవల్లికి చెందిన లేబర్‌ కాంట్రాక్టర్‌ అలుగులు లక్ష్మయ్య పేరున రూ.1,24,500, అద్దంకికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసరావు పేరున రూ.95 వేలు చొప్పున చెక్కులు డ్రా అయ్యాయి. వీటికి సంబంధించిన బిల్లులు, ఓచర్లు అందజేయక పోవడంతో నిధులు దుర్వినియోగమైనట్లు భావించి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వీరితో పాటు అప్పట్లో మరో ముగ్గురు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తేళ్ల జాహ్నవి, గౌతమి, షేక్‌ జిలానీలపై కేసు నమోదు చేశారు.

అరెస్టు ఇలా..
వీరంతా సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ వద్దకు వచ్చారు. ఆయనతో మాట్లాడి కార్యాలయం నుంచి బయటకు రాగానే గతంలో కేసు నమోదైనందున తమ విచారణకు సహకరించాలని తాలూకా సీఐ ఎం.లక్ష్మణ్‌ వారిని కోరారు. అనంతరం వారిని తాలూకా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం అప్పటి ఈడీ అరపికట్ల నాగేశ్వరరావు, ఏఈవో అంబటి శ్రీనివాసరావు, పీట్ల వెంకట ఆంజనేయులు, ఏటి ఏడుకొండలు, బత్తినేని యోగిరుత్‌ కమలేశ్వరరావు, దోర్నాల మండలానికి చెందిన లేబర్‌ కాంట్రాక్టర్‌ అలుగుల లక్ష్మయ్య, అద్దంకికి చెందిన చెన్నుపల్లి శ్రీనివాసరావు, ఒంగోలుకు చెందిన తేళ్ల జాహ్నవి, షేక్‌ జిలానీలను అరెస్టు చేశారు. ఈ కేసులో ఐదో నిందితుడు రాజేష్‌ ఆచూకీ లభించలేదని పోలీసులు పేర్కొంటున్నారు. అతని స్వస్థలం విజయనగరంగా చెబుతున్నారు. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. పదో నిందితురాలిగా పేర్కొన్న మరో ఉద్యోగిని గౌతమిపై ప్రాథమికంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రమేయం ఉన్నట్లు రూఢీ కాకపోవడంతో ఆమెను అరెస్టు చేయలేదని సీఐ లక్ష్మణ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు