రక్తపుటేరులు

23 Mar, 2019 13:22 IST|Sakshi

లారీని ఢీకొన్న క్రూషర్‌ 9 మంది మృతి

ఆరుగురికి గాయాలు

మృతులు కలబుర్గి జిల్లా చిత్తాపుర వాసులు

గోవాలో హోలీ సంబరాలు ముగించుకుని వస్తుండగా ఘోరం

మండ్యలో మరో ప్రమాదం

ఐదుగురు దుర్మరణం

రంగుల హోలీ సంబరాల్లో మునిగి ఆ మధుర జ్ఞాపకాలతో సొంతూరుకు పయనమైన యువకులపై మృత్యువు కర్కశంగా విరుచుకుపడింది.  అతివేగమే ప్రాణం తీసింది.  వేగంగా వెళ్తూ ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో  తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గోవాకు వెళ్లిన తమ పిల్లలు వస్తున్నారని ఇళ్లలో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు పిడుగులాంటి వార్త విని కుప్పకూలిపోయారు. విజయపుర జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది యువకులు మృత్యువాత పడ్డారు.  

సాక్షి, బళ్లారి: కర్ణాటకలో శుక్రవారం మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.« మూడు రోజుల కిందట ధార్వాడ నగరంలో ఐదంతస్తుల భవంతి కుప్పకూలిన ఘటనలో 12 మంది మృతి చెందిన ఘటన మరవకముందే విజయపుర జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన సంభవించింది. శుక్రవారం విజయపుర జిల్లా సింధగి తాలూకా, చిక్క సింధగి సమీపంలోకి జాతీయ రహదారి 218లో క్రూసర్‌–లారీ ఢీకొనడంతో ఘటన స్థలంలోనే 9 మంది మృతి చెందడంతో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోవడంతో పాటు ఆ ప్రాంతం రక్తమడుగుతో భీతావహంగా మారింది.

మృతులు అందరూ కూలికార్మికులు కాగా గోవాలో హోలీ సంబరాలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కలబుర్గి జిల్లాకు చెందిన కట్టడ కూలి కార్మికులు గోవా నుంచి తిరిగి వస్తుండగా లారీ ఢీకొనడంతో క్రూషర్‌లో ఉన్న వారంతా చెల్లా చెదురుగా పడిపోయారు. దీంతో అక్కడికక్కడే 9 మంది మృతి చెందడంతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే కలకలం సృíష్టించింది. మృతులను సాగర్‌ (24), చాంద్‌బాషా (22), అజీం (21), అంబరీష్‌ (29), కే.కే.షాకీర్‌ (25), శ్రీనాథ్‌ (30), యూసఫ్‌ (27), గురు (21), మాబుసాబ్‌ (29)లుగా గుర్తించారు. హోలీ సంబరాలను ఆనందంగా చేసుకుని తిరిగి వస్తుండగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో చిత్తాపురలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికొచ్చిన కొడుకును పొగొట్టుకున్న తల్లిదండ్రుల రోదనలు, కట్టుకున్న భర్త అకాల మృత్యువు చెందడంతో భార్య రోదనలు చిత్తాపురలో కలిచివేశాయి. సింధగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్‌ అతివేగమే ప్రాణం తీసిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు