బెదిరిస్తున్న నీరవ్‌ మోదీ

7 Nov, 2019 10:43 IST|Sakshi
నీరవ్‌ మోదీ

లండన్‌: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ(48)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్‌ కోసం నాలుగోసారి అతడు పెట్టుకున్న పిటిషన్‌ను లండన్‌ కోర్టు తిరస్కరించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ని రూ.14వేల కోట్ల మేర మోసం చేసిన ఆరోపణలపై అతడిని అప్పగించాలంటూ భారత్‌ కోరుతున్న విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నందున నీరవ్‌కు బెయిల్‌ ఇవ్వాలని లాయర్లు వాదించారు. బాండ్‌ మొత్తాన్ని రూ.18 కోట్ల నుంచి రూ.36 కోట్ల(4 మిలియన్‌ పౌండ్లు)కు పెంచేందుకు అంగీకరించినా వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరస్కరించారు.

విచారణ ముగిసిన తర్వాత అతడిని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్‌ జైలుకు తరలించారు. డిసెంబర్‌ 4న వీడియో లింక్‌ ద్వారా అతడిని కోర్టు విచారించనుంది. నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ను భారత్‌ తరపున వాదిస్తున్న న్యాయవాది సవాల్‌ చేశారు. తనను భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్‌ మోదీ బెదిరిస్తున్న విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జైలులో తన క్లైంట్‌పై దాడి జరిగిందని నీరవ్‌మోదీ తరపు లాయర్‌ వెల్లడించారు. అతడిపై భారత్‌ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, దీనికి అక్కడి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆరోపించారు.

మరిన్ని వార్తలు