అన్ని పూర్తయ్యాయి, ఇక మిగిలింది ఉరే

4 Mar, 2020 14:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 2012 నిర‍్భయ సామూహిక హత్యాచార కేసులో దోషి పవన్‌ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష పిటీషన్‌ను రాష్ట్రపతి  రామనాధ్‌ కోవింద్‌ తాజాగా  తోసిపుచ్చారు. దీంతో మరణశిక్షను తప్పించుకునేందుకు మొత్తం నలుగురు దోషులకున్న అన్ని న్యాయపరమైన అవకాశాలు దాదాపు పూర్తి అయ్యాయి. దీంతో నిర్బయ దోషుల ఉరిశిక్షకు లైన్‌ క్లియర్‌ అయినట్టుగానే భావించవచ్చు. అయితే  రాష్ట్రపతి నిర్ణయంపై పవన్‌ గుప్తా న్యాయ సమీక్షను కోరే అవకాశం లేకపోలేదు. 

ఈ నెలలో దోషులను ఉరితీస్తారని ఆశిద్దామంటూ  నిర్భయ తండ్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తాజా పరిణామంపై నిర్భయ తల్లిదండ్రుల తరపు వాదిస్తున్న న్యాయవాది సీమా ఖుష్వాహా మాట్లాడుతూ ఇక మిగిలింది ఉరిశిక్ష అమలేనని పేర్కొన్నారు. నలుగురు దోషుల ఉరిశిక్షకు సంబంధించిన తాజా తేదీని నిర్ణయించేలా ఢిల్లీ కోర్టును అశ్రయించనున్నామని తెలిపారు. అక్షయ్ ఠాకూర్ (31) పవన్ గుప్తా (25) వినయ్ శర్మ (26) ముఖేష్ సింగ్ (32) దోషులందరికి అన్ని అవకాశాలు ముగిసాయి...ఇక ఇపుడు నిర్ణయించే తేదీ తుది తేదీ అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.  నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ఉరిశిక్ష అమలు వివిధ న్యాయపరమైన అడ్డంకుల కారణంగా ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు