నిర్భయ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన బస్సు ఏమైంది?

25 Sep, 2018 19:10 IST|Sakshi
నిర్బయ ఘటనకు సజీవ సాక్ష్యంగా నిలిచిన యాదవ్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు (కర్టెసీ : హిందుస్థాన్‌ టైమ్స్‌))

ఏదైనా ఒక కేసు నిలవాలంటే అందుకు బలమైన సాక్ష్యం ఉండి తీరాల్సిందే. ఎందుకంటే వాదోపవాదాలు, ఉద్వేగాల కంటే కూడా తీర్పు వెలువరించే క్రమంలో సాక్ష్యాలనే ప్రామాణికంగా పరిగణిస్తుంది న్యాయస్థానం. మళ్లీ ఇక్కడ సాక్ష్యం అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు... నేరస్తున్ని పట్టించేందుకు, నేరాన్ని రుజువు చేసేందుకు ఉపయోగించే ఏ వస్తువైనా కేసు ప్రాపర్టీగానే పరిగణిస్తారు. ఆ కోవకు చెందినదే పై ఫొటోలో కన్పిస్తున్న బస్సు. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ పోలీస్‌ స్టేషనులో ఎఫ్‌ఐఆర్‌ నంబరు 413/2012లో కేసు ప్రాపర్టీగా నమోదైన ఈ బస్సు సుమారు 2,26,784 కిలోమీటర్లు ప్రయాణించింది. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడటంలో కీలక పాత్ర పోషించింది.

ఆరేళ్ల క్రితం 2012, డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఆరోజు రాత్రి ఇంటికి వెళ్లడానికి ఓ 23 ఏళ్ల యువతి, ఆమె స్నేహితుడు కలిసి డీఎల్‌ 1పీసీ 0149 నంబరు బస్సు ఎక్కారు. కానీ అదే వారి పాలిట శాపంగా మారనుందని ఆ క్షణంలో ఊహించలేకపోయారు. రోడ్డుపై బస్సు తిప్పుతూ ఆరుగురు మృగాళ్లు అత్యంత దారుణంగా ఆ యువతిపై అకృత్యానికి ఒడిగట్టారు. అంతేకాకుండా ఆమెకు అండగా నిలిచేందుకు వచ్చిన స్నేహితుడిని దారుణంగా కొట్టారు. ఆ తర్వాత ఇద్దరినీ నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు మానవత్వంలేని ఆ కిరాతకులు. ఆ అకృత్యానికి సాక్ష్యంగా నిలిచిందీ బస్సు.

కేసు ప్రాపర్టీని జాగ్రత్తగా కాపాడేందుకు..
యువతి పట్ల నిందితులు వ్యవహరించిన తీరు మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరిని కదిలించింది. అందుకే ఆవేశం పెల్లుబికి.. నిరసన రూపంలో రోడ్డుపైకి చేరింది. యువతలోని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితులు పారిపోవడంతో.. నేరం చేయడానికి వారు ఉపయోగించుకున్న బస్సును కాల్చివేసేందుకు పురిగొల్పింది. అయితే అప్పుడే పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. కేసు ప్రాపర్టీని కాపాడేందుకు మఫ్టీ దుస్తుల్లో కాపలా కాశారు.

ప్రస్తుతం డంప్‌యార్డులో..
ఘటన జరిగిన తర్వాతి రోజు అంటే డిసెంబరు 17న నిందితులు నివసించే సంత్‌ రవిదాస్‌ క్యాంపు నుంచి బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు కీలక ఆధారాలన్నీ బస్సులోనే ఉన్న నేపథ్యంలో.. దక్షిణ ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంకు రహస్యంగా తరలించారు. నిరసనకారులకు అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని బస్సులతో పాటుగానే ఈ బస్సును కూడా పార్క్‌ చేశారు. ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా బస్సు ఉన్న చోటికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు, వెంట్రుకలు తదితర కీలకమైన ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత సాకేత్‌ కోర్టు కాంప్లెక్సులో బస్సును పార్క్‌ చేశారు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉన్న జంక్‌ వెహికల్స్‌ను తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలంటూ గత ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఆరేళ్ల క్రితం ఘటన జరిగిన తర్వాత ప్రయాణించిన మార్గం గుండానే పశ్చిమ ఢిల్లీలోని డంప్‌ యార్డుకు ఈ బస్సును తరలించారు.

5 వేల రూపాయలు కూడా రావు..
నిర్భయ ఘటనకు సాక్ష్యంగా నిలిచిన ఈ బస్సు నోయిడా నివాసి అయిన దినేశ్‌ యాదవ్‌ అనే వ్యక్తికి చెందిన యాదవ్‌ ట్రావెల్స్‌కు చెందినది. బస్సులను అద్దెకి తిప్పే వృత్తిలో కొనసాగుతున్న దినేశ్‌.. ఈ బస్సును కూడా నిందితులకు అద్దెకు ఇచ్చాడు. ఈ క్రమంలోనే నిర్భయ వారి బస్సు ఎక్కడం, వారు ఆమెపై దారుణానికి ఒడిగట్టడం జరిగాయి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత తన బస్సును తిరిగి ఇప్పించాల్సిందిగా దినేశ్‌ రెండుసార్లు పోలీసులను అభ్యర్థించాడు. కానీ అప్పటికే పాక్షికంగా ధ్వంసమైన ఆ బస్సును కనీసం 5 వేల రూపాయలకు కూడా కొనేవాళ్లు లేకపోవడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడని సీనియర్‌ పోలీసు ఆఫీసర్‌ ఒకరు తెలిపారు. అయితే దినేశ్‌ నడిపే 11 బస్సులు కూడా నకిలీ పేపర్లతో రిజిస్టర్‌ అయినవే. అతడు కూడా నేర చరిత్ర కలిగిన వాడేనన్నది గమనార్హం. ఘటన జరగడానికి రెండేళ్ల క్రితం ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఈ బస్సు డ్రైవర్‌కు ఎనిమిదిసార్లు జరిమానా విధించారు ట్రాఫిక్‌ పోలీసులు. ఇలా జరుగుతున్న ప్రతిసారీ జరిమానా కట్టి దినేశ్‌ బస్సును నడిపించేవాడు.

ఆరోజు ఏం జరిగింది..
2012, డిసెంబర్ 16వ తేదీ రాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై ఆరుగురు లైంగిక దాడికి పాల్పడి, ఆపై ఆమెను, ఆమె స్నేహితుడిని నగ్నంగా రోడ్డు మీదకు విసిరేశారు. ప్రాణాల కోసం పోరాడి చివరకు ఆ యువతి కన్నుమూసింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో రామ్ సింగ్ తీహార్ జైల్లో 2013 మార్చిలో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత విడుదలయ్యాడు(అతనిపై నిఘా కొనసాగుతుంది). ఇక మిగిలిన నలుగురు నిందితులు అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్‌లకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు