నిర్భయ దోషులు : పలు సంచలన విషయాలు

15 Jan, 2020 12:02 IST|Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక హత్యాకాండలో  శిక్ష అనుభవించబోతున్న  దోషులకు సంబంధించి సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.  దోషులు  అక్షయ్ ఠాకూర్ సింగ్, ముకేశ్‌, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు జనవరి 22 న ఉదయం 7 గంటలకు ఉరి తీయనున్నట్లు ఢిల్లీ కోర్టు ఈ నెల ప్రారంభంలో డెత్ వారెంట్‌  జారీ చేసింది. అటు మరణశిక్షకు వ్యతిరేకంగా ముగ్గురు దోషులు దాఖలు చేసుకున్న క్యూరేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఈ నేపథ‍్యంలో మరో వారం రోజుల్లో వీరికి మరణశిక్ష అమలు కానుంది. గత ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ తీహార్ జైలులో ఉన్న  వీరు అనేకసార్లు జైలు నిబంధనలు ఉల్లంఘించారు. అంతేకాదు  పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారని  సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 

2012 డిసెంబర్ 16 న యువ వైద్య విద్యార్థిని (నిర్భయ)ను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది.  తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ డిసెంబరు 29న నిర్భయ కన్నుమూయడంతో ఆందోళన ఉరింత ఉధృతమైంది.  ఈ కేసులో సుమారు ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత నలుగురు దోషులు, అక్షయ్‌, ముకేష్‌, పవన్‌, వినయ్‌ శర్మలకు మరణ శిక్ష అమలు కానున్న సంగతి తెలిసిందే.  అయితే  ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఈ నలుగురు  23 సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారని వర్గాలు తెలిపాయి. జైల్లో వీరి సంపాదన మొత్తం దాదాపు రూ .1,37,000.  గత ఏడు సంవత్సరాల సమయంలో జైలు నియమాలను ఉల్లంఘించినందుకు వినయ్ 11 సార్లు, అక్షయ్ ఒకసారి శిక్ష అనుభవించాడు. ముకేశ్‌ మూడుసార్లు, పవన్ ఎనిమిది సార్లు నిబంధనలను అతిక్రమించారు. ముకేశ్‌ ఎలాంటి పని చేయకూడదని నిర్ణయించుకోగా అక్షయ్ రూ .69 వేలు సంపాదించగా,  పవన్ రూ .29 వేలు,  వినయ్ రూ .39 వేలు సంపాదించాడు.

2016లో ముగ్గురు దోషులు - ముకేష్‌, పవన్, అక్షయ్ - 10 వ తరగతికి  అర్హత సంపాదించి పరీక్షలకు హాజరయ్యారు కానీ ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వినయ్, 2015 లో, బ్యాచిలర్ డిగ్రీ కోసం ఎంట్రన్స్‌ పాస్‌ అయినా కాని అతను దానిని పూర్తి చేయలేకపోయాడు. ఉరిశిక్ష అమలుకు ముందు దోషులందరి కుటుంబానికి కలవడానికి   రెండుసార్లు అనుమతించారు అధికారులు.  దీంతో వినయ్‌ను తండ్రి మంగళవారం కలిశారు.

కాగా ఈ నలుగురిని ఉరి తీసే ఏర్పాట్లు గత నెలలో ప్రారంభమయ్యాయి. దోషులను సీసీటీవీ పర్యవేక్షణలో వేర్వేరు గదుల్లో ఉంచారు. అటు ఉరితీత సన్నాహకాల్లో భాగంగా జైలు అధికారులు ట్రయల్‌ కూడా నిర్వహించారు. మీరట్‌కు చెందిన పవన్‌ జల్లాద్‌ ఈ నలుగురిని ఉరి తీయనున్నారు. మరోవైపు  ముకేష్‌  దేశాధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్‌కు మంగళవారం మెర్సీ పిటిషన్  పెట్టుకున్నసంగతి  విదితమే.

చదవండి :  నిర్భయ: ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు
               నిర్భయ దోషులకు సుప్రీంలో షాక్‌!

మరిన్ని వార్తలు