యువతిని మోసగించినందుకు ఏడేళ్ల జైలు

12 Oct, 2019 08:44 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ప్రేమించి గర్భవతిని చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన ఒకరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ శుక్రవారం ఫ్యామిలీ కోర్టు జడ్జి సి. రత్నప్రభావతి తీర్పు చెప్పారు. దీని వివరాలను పీపీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కంపౌడ్‌కు చెందిన గైక్వాడి యశోద బార్‌దాన్‌ లెబర్‌గా పని చేస్తుండగా, అదే కాలనీకి చెందిన నవబందే సునీల్‌ లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. ఒకే కాలనీకి చెందిన వీరిద్దరూ పరిచయటం కావటంతో అది ప్రేమగా మారింది. దాంతో సునీల్‌ యశోదతో శారీరక సంబంధం పెట్టుకుని ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం సునీల్‌ యశోద వద్దకు రాకపోవడంతో ఆమె అతడికి ఫోన్‌ చేసి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. దీంతో సునీల్‌ నిరాకరిస్తూ ఫోన్‌ స్వీచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో యశోద ఒకటి ఏప్రిల్‌ 2014న నగరంలోని ఒకటో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సునీల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసులు సునీల్‌పై ఐపీసీ 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్‌హెచ్‌ఓ నర్సింగ్‌యాదవ్‌ ఈ కేసును దర్యాప్తు చేశారు. పోలీసులు యశోదకు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా ఆమె గర్భవతని తేలటంతో సునీల్‌పై ఐపీసీ 376 సెక్షన్‌ను జత పరిచి కేసు నమోదు చేశారు. కాగా యశోద 7వ నెలలోనే ప్రసవించడంతో పుట్టిన మగబిడ్డ మృతి చెందాడు. బాబు ఎముకలను సేకరించిన పోలీసులు డీఎన్‌ఏ పరీక్షలకు పంపగా, బాబు సునీల్‌ యశోదలకే జన్మించినట్లు అక్కడి నుంచి రిపోర్టు వచ్చింది. దాంతో కేసు విచారణలో సునీల్‌ చేసిన నేరం రుజువు కావడంతో ముద్దాయికి మూడు సెక్షన్‌ల కింద ఏడేళ్ల జైలు, రూ. 600 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ శిక్షలన్ని ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు