కిడ్నాప్‌.. ఉత్తిదే..!

28 May, 2018 12:17 IST|Sakshi
కిడ్నాప్‌ డ్రామా ఆడిన ప్రమోద్‌

కల్లూరు : కల్లూరుకు చెందిన బాలుడి కిడ్నాప్‌.. కట్టు కథగా తేలింది. కల్లూరు శాంతినగర్‌కు చెందిన గుండ్ర ప్రమోద్‌(13)ను ఇన్నోవాలో వచ్చిన ముగ్గురు కిడ్నాప్‌ చేసి ఖమ్మం తీసుకెళ్లారని, తప్పించుకుని బయటపడ్డానని, ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఖమ్మం వాసులు అప్పగించారని ప్రమోద్‌ చెప్పిన వివరాలతో పత్రికల్లో ఆదివారం వార్త ప్రచురితమైంది.

తననెవరూ కిడ్నాప్‌ చేయలేదని, తానే కట్టుకథ అల్లానని ఆ పిల్లాడు పోలీసులతో చెప్పాడు. తానే కల్లూరు నుంచి బస్సు ఎక్కి ఖమ్మం వెళ్లానని చెప్పాడు. కల్లూరులో ఆదివారం విలేకరుల సమావేశంలో సీఐ మడత రమేష్, ఎస్‌ఐ పవన్‌కుమార్‌ సమక్షంలో ప్రమోద్‌ ఇలా చెప్పాడు. 

‘‘మా ఇంటి పక్కనున్న బాబాయికి చెందిన న్యూడిల్స్‌ బండిని కదిలిస్తుండగా, పక్కనున్న స్కూటర్‌ కింద పడిపోయింది. దాని ట్యాంకులోని పెట్రోల్‌ కారిపోయింది. బాబాయి అరవడంతో భయపడ్డాను. ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకుని కల్లూరు మెయిన్‌ రోడ్డు వద్దకు వెళ్లాను.

అప్పుడే ఖమ్మం బస్సు రావడంతో ఎక్కాను. ఖమ్మం బస్టాండులో దిగాను. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళుతుండగా ఎవరో ఆపారు. నన్ను ఎవరో కిడ్నాప్‌ చేశారని కట్టు కథ చెప్పాను. వారు పోలీసులకు అప్పగించారు. ఖమ్మం పోలీసులు మా అమ్మానాన్నను పిలిపించి అప్పగించారు’’. 

ప్రమోద్, ప్రస్తుతం సత్తుపల్లి మండలం తాళ్ళమడ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సీఐ, ఎస్‌ మాట్లాడుతూ.. ఇంటి వద్ద బాబాయి అరవడంతో ప్రమోద్‌ భయపడి కిడ్నాప్‌ కథ అల్లాడని చెప్పారు.

వదంతులు నమ్మొద్దు 

కల్లూరురూరల్‌ : గ్రామాలలో కొంతమంది అనవసరంగా వదంతులు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వాటిని నమ్మవద్దని సత్తుపల్లి రూరల్‌ సీఐ మడత రమేష్, కల్లూరు ఎస్‌ఐ డి.పవన్‌కుమార్‌ కోరారు.

ఆదివారం కల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో దొంగల ముఠాలు లేవని, కిడ్నాపర్లు లేరని స్పష్టం చేశారు. గ్రామాలలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు.

అనుమానాస్పద వ్యక్తులపై దాడి చేస్తే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మతిస్థిమితం లేని వ్యక్తులు గ్రామాలలో తిరుగుతుంటారని, వారిపై దాడి చేయడం సరికాదని అన్నారు. దొంగల ముఠాలు, కిడ్నాప్‌ ముఠాలు సంచరిస్తున్నాయంటూ వదంతులు సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

మరిన్ని వార్తలు