నెలలు గడిచినా వీడని మిస్టరీ!

24 Aug, 2019 07:18 IST|Sakshi
దీనంగా ఎదురు చేస్తున్న ఆరుష్‌ తల్లిదండ్రులు 

ఆరుష్‌రెడ్డి కిడ్నాపై రెండు నెలలైనా నేటికీ ఆచూకీ దొరకని వైనం

విశాఖలో కిడ్నాప్‌ గ్యాంగ్‌ అరెస్ట్‌తో ఆరుష్‌రెడ్డి కేసుపై సర్వత్రా చర్చ

ఇప్పటికే 180 మంది అనుమానితులను విచారించిన పోలీసులు

కాల్స్‌ డేటా సేకరించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఐటీకోర్‌ సిబ్బంది

సాక్షి, ఒంగోలు: ఆరు బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు ఆరుష్‌రెడ్డి అదృశ్యమై నేటికి సరిగ్గా రెండు నెలలు.. విశాఖపట్నంలో కిడ్నాప్‌ ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఐదుగురు చిన్నారులను రక్షించారనే సమాచారం తెలియడంతో ఆరుష్‌రెడ్డి ఘటనపై మళ్లీ చర్చ మొదలైంది. విశాఖపట్నం పోలీసుల అదుపులో కిడ్నాప్‌ ముఠా ఉందనే సమాచారంతో నాలుగు రోజుల క్రితమే అక్కడకు వెళ్లి ఆరుష్‌రెడ్డి కోసం విచారించినప్పటికీ ఆచూకీ మాత్రం దొరకలేదు. కన్న బిడ్డ జాడ రెండు నెలలుగా ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. ఆరూష్‌రెడ్డి కిడ్నాప్‌ జరిగిన సమయంలో పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్యం వల్లే కిడ్నాప్‌ గ్యాంగ్‌ చూకీ కనిపెట్ట లేకపోతున్నారనేది తెలిసిన విషయమే. అయితే ఆ తరువాత మేల్కొన్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేసినా ఫలితం లేదు. కాల్‌ డేటా ఆధారంగా అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్న పోలీసులు గుంటూరు జిల్లా నూజెండ్ల మండలానికి చెందిన కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

పిల్లల్ని కిడ్నాప్‌ చేసే ముఠాలతో వీరికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వీరి పాత్ర ఏమైనా ఉందా.. అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ముండ్లమూరు మండలం రెడ్డినగర్‌కు చెందిన మేడగం అశోక్‌రెడ్డి, జ్యోతి దంపతుల రెండేళ్ల కుమారుడు ఆరుష్‌రెడ్డి ఈ ఏడాది జూన్‌ 24వ తేదీన ఇంటి ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. మే 31వ తేదీన ఆరుష్‌రెడ్డి పుట్టిన రోజున నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా జీవించు కన్నా.. అంటూ ఆశీర్వదించిన 20 రోజుల్లోనే బిడ్డ కనిపించకుండా పోవడం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలోకి నెట్టింది. కన్నబిడ్డ కనిపించకుండాపోయి రెండు నెలలు గడుస్తున్నా జాడ దొరక్కపోవడంతో ఆ తల్లిదండ్రుల కంటిపై కునుకు లేకుండా పోయింది. ఆరుష్‌రెడ్డి కేసును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దర్శి పోలీసులకు సహకారం అందించేందుకు ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో కూడిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు ఐటీ కోర్‌ సహకారం తీసుకుంటున్నారు. 

అనుమానాలెన్నో...
ఆరుష్‌రెడ్డి అదృశ్యం కేసు మిస్టరీగా మారడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దుండగులు ఎటువంటి ఆధారాలూ దొరక్కుండా జాగ్రత్తపడటంతో పోలీసులకు కేసు దర్యాప్తు కష్టతరంగా మారింది. గ్రామంలో ఆ కుటుంబానికి విరోధులు, తెలిసిన వ్యక్తుల పనేనని కొందరు.. ఒడిశాకు చెందిన వారే కిడ్నాప్‌ చేశారంటూ మరికొందరు.. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠానే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఇంకొందరు.. చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి పిల్లల్ని కిడ్నాప్‌ చేసే ముఠాలకు అమ్మి ఉంటారంటూ ఇంకొందరు.. ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. దర్శి కేంద్రంగా పలు పరీక్షలు రాసేందుకు వచ్చిన ఒడిశాకు చెందిన వ్యక్తులే కిడ్నాప్‌ చేసి ఉంటారనే పుకార్ల నేపథ్యంలో ఒడిశాకు ప్రత్యేక బృందాలను పంపి దర్యాప్తు చేసినా ఎటువంటి ఆధారాలూ దొరకలేదు.

ఆరుష్‌ తల్లిదండ్రులతో విరోధం ఉన్న గ్రామస్తులు ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారా.. లేక గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడే వారెవరైనా కిడ్నాప్‌ చేశారా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేశారు. చిన్నపిల్లలను బలిస్తే నిధి నిక్షేపాలు దొరుకుతాయనే మూఢ నమ్మకాలతో గతంలో ఎవరైనా ఇలాంటి కిడ్నాప్‌లకు పాల్పడ్డారా అనే సమాచారం సేకరించిన పోలీసులు ఇలాంటి ముఠాలపైనా నిఘా ఉంచారు. ముంబై, హైదరాబాద్, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాల్లో చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేసే ముఠాలతో సంబంధాలు ఉన్న కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆరుష్‌రెడ్డి కిడ్నాప్‌కు గురైన రోజు ఆయా టవర్ల పరిధిలో 1.53 లక్షల ఫోన్‌లు మాట్లాడినట్లు కాల్‌లిస్ట్‌ ద్వారా తెలుసుకున్న పోలీసులు వాటిలో ఫిల్టర్‌ చేసుకుంటూ వచ్చి చివరకు 600 ఫోన్‌కాల్స్‌ డేటాను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే సుమారుగా 180 మంది అనుమానితులను పోలీసులు విచారించినట్లు చెబుతున్నారు. దీని ఆధారంగా ఏమైనా ఆధారం దొరుకుతుందేమోననే కోణంలో ఐటీకోర్‌ టీమ్‌లు పనిచేస్తున్నాయి. 

త్వరలోనే ఆచూకీ కనిపెడతాం..
ఆరూష్‌రెడ్డి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు శక్తివంచన లేకుండా పని చేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో ఆధారాల కోసం అన్వేషిస్తున్నాం. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. త్వరలో కేసు మిస్టరీని ఛేదించి బాలుడి ఆచూకీని కనిపెడతామనే నమ్మకం మాకుంది. ఈ ప్రయత్నంలో అందరూ పోలీసులకు సహకరించాలి.  
– సిద్ధార్థ్‌ కౌశల్, జిల్లా ఎస్పీ

మరిన్ని వార్తలు