విషాదం : కాలిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు

31 Oct, 2019 09:30 IST|Sakshi

రాజస్తాన్‌ : మానవత్వం మంట కలిసింది. ఎదురుగా కారులో మంటల్లో కాలిపోతున్న వ్యక్తిని కాపాడాల్సింది పోయి ఫోన్లతో వీడియోలు తీసిన ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్‌కి చెందిన ప్రేమ్‌చంద్‌ జైన్‌ (53) అనే వ్యాపారవేత్త బుధవారం ఉదయం అనంతపురలో ఉన్న ఫ్యాక్టరీకి తన కారులో బయలుదేరాడు. ఈ నేపథ్యంలో కోట- ఉదయ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఉన్న దక్కడ్‌కేడీ గ్రామం వద్దకు రాగానే అతని కారు ఆగిపోయింది.

ఒక్కసారిగా కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రేమ్‌చంద్‌ బయటికి రావడానికి ప్రయత్నించాడు. కానీ కారు సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ పనిచేయకపోవడంతో మంటల్లో చిక్కుకున్న ప్రేమ్‌ తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. అటుగా వెళ్తున్న వాహనాదారులు మంటల్లో చిక్కుకున్న అతన్ని కాపాడాల్సింది పోయి ఫోన్లతో వీడియోలు చిత్రీకరించారు. ఈ హృదయ విధారక ఘటనలో ప్రేమ్‌ చంద్‌ శరీరం మొత్తం కాలిపోయి కేవలం అతని అస్తిపంజరం మాత్రమే మిగిలింది.

'ప్రేమ్‌చంద్‌ కారు మంటల్లో చిక్కుకున్న సమాచారం మాకు 10.25 గంటల సమయంలో తెలిసింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని బాడీనీ బయటికి తీసినట్లు' అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ దేవేంద్ర గౌతమ్‌ వెల్లడించారు. కారు మంటల్లో చిక్కుకొని ప్రేమ్‌ ఆర్తనాదాలు చేస్తుంటే ఫోన్లలో వీడియోలు తీస్తున్నారే తప్ప ఒక్కరు కూడా స్పందించలేదని పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించి కిటికీ అద్దాలు పగులగొట్టి బయటికి తీసుంటే ప్రేమ్‌చంద్‌ బతికేవాడని ఆయన వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి సెక‌్షన్‌ 174 కింద కేసు నమోదు చేసినట్లు దేవేంద్ర వెల్లడించారు.


 

మరిన్ని వార్తలు