నాకు బతకాలన్న కోరిక లేదు

28 May, 2018 19:13 IST|Sakshi
సునంద పుష్కర్‌, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌

న్యూఢిల్లీ : ‘ నాకు బతకాలన్న ఏ కోరికా లేదు’   అని సునంద పుష్కర్‌, ఆమె భర్త మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్‌కు తాను చనిపోయే ముందు మెయిల్‌ చేసిందని ఢిల్లీ పోలీసులు సోమవారం కోర్టులో తెలిపారు. శశి థరూర్‌, ఆయన భార్య సునంద పుష్కర్‌ ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఈ మేరకు 3 వేల పేజీల  చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. సోషల్‌ మీడియాలో ఆమె చేసిన ట్వీట్లు, మెయిల్స్‌, మెసేజ్‌లే ఆమె మరణ వాంగ్మూలం కింద తీసుకున్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. శశి థరూర్‌ నిందితుడని రుజువు చేయడానికి ఈ సాక్ష్యాలు సరిపోతాయని కోర్టుకు విన్నవించారు. 

‘ నాకు జీవించాలన్న కోరిక లేదు..చావు కోసం ఎదురు చూస్తున్నాను’  అని జనవరి 8వ తేదీన సునంద, థరూర్‌కు ఈ మెయిల్‌ చేసిందని, ఢిల్లీలోని ఓ లక్జరీ హోటల్లో ఆమె సూట్‌లో సరిగ్గా చనిపోవడానికి తొమ్మిది రోజుల ముందు ఈమెయిల్‌ చేసినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. పాయిజనింగ్‌ కారణంగా ఆమె చనిపోయినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. ఆమె రూంలో 27 అల్‌ప్రాక్స్‌ టాబ్లెట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే ఆమె ఎన్ని మాత్రలు మింగిందనేది స్పష్టంగా చార్జిషీటులో పేర్కొనలేదు. సునంద పుష్కర్‌ డిప్రెషన్‌లోకి వెళ్లినా ఒక భర్తగా శశి థరూర్‌ పట్టించుకోకపోవడం వల్లే, ఆమె అల్‌ప్రాక్స్‌ టాబ్లెట్‌ మింగిందని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌), చార్జిషీటులో పేర్కొంది.

దంపతులిద్దరూ తరచూ కొట్లాడుకునేవారని, ఆమె ఒంటిపై గాయాలు అంత సీరియస్‌ గాయాలు కానప్పటికీ తరచూ వాదులాడుకునేవారని సిట్‌ చార్జిషీటులో వెల్లడించింది. ఆమె యాంటీ డిప్రెషన్‌ టాబ్లెట్లు కూడా వాడేదని పేర్కొన్నారు. శశి థరూర్‌కు‌, పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌తో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం కలగడంతో ఇరువురి మధ్య పబ్లిక్‌గా ట్విటర్‌లో యుద్ధం కూడా జరిగింది. సునంద పుష్కర్‌ కాల్‌ చేస్తే ఆమె భర్త థరూర్‌ డిస్‌కనెక్ట్‌ చేయడం, అసలు పట్టించుకోకపోవడం కూడా చేశాడని సిట్‌, చార్జిషీటులో తెలిపింది.

 శశి థరూర్‌కు, సునంద పుష్కర్‌ల వివాహం 2010లో జరిగింది. శశి థరూర్‌కు సునంద మూడో భార్య కాగా..సునందకు కూడా శశి థరూర్‌ మూడో భర్తే. పెళ్లి అయిన నాలుగేళ్లకే సునంద అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇది ఇలా ఉండగా మాజీ కేంద్ర శశి థరూర్‌ మాత్రం తాను భార్యను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించానని చార్జిషీటు దాఖలు చేయడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు.


 

మరిన్ని వార్తలు