ఎన్నారై మహిళపై ఎమ్మెల్సీ ఫరూఖ్‌ దౌర్జన్యం

10 Oct, 2017 02:30 IST|Sakshi

అద్దెకు ఇచ్చిన ఫ్లాట్‌ ఖాళీ చేయమన్నందుకు..

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ విచక్షణ కోల్పోయారు. అద్దె చెల్లించలేదని, ఇంటిని ఖాళీ చేయాలని కోరిన యజమానిపై చెప్పుతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర పదజాలంతో దూషించారు. మహిళ అని కూడా చూడకుండా మెడ పట్టి ఇంటి నుంచి గెంటేయించారు. హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని స్కిల్‌ స్లె్పండర్‌ అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన అమ్‌తుల్‌ వసై, మహ్మద్‌ వసై భార్యభర్తలు.

వీరు అమెరికాలోని న్యూయార్క్‌లో కుటుంబంతో నివసిస్తున్నారు. స్కిల్‌ స్లె్పండర్‌ అపార్ట్‌మెంట్‌లోని తమ ఫ్లాట్‌ను ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌కు అద్దెకు ఇచ్చారు. అయితే రెండేళ్లుగా ఫరూక్‌ ఫ్లాట్‌ అద్దె చెల్లించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ చేయాల్సిందిగా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీంతో ఫ్లాట్‌ను ఖాళీ చేయించేందుకు అమ్‌తుల్‌ వసై అమెరికా నుంచి నగరానికి వచ్చారు. ఉదయాన్నే తమ్ముడు మహ్మద్‌ ముజ్‌తుబాతో కలసి అమ్‌తుల్‌ వసై.. ఫరూఖ్‌ నివసిస్తున్న తమ ఫ్లాట్‌కు వెళ్లారు.

ఇంట్లోకి వెళ్తూనే ముజ్‌తుమా ఫోన్‌లో వీడియా రికార్డింగ్‌ ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా ఫ్లాట్‌ ఖాళీ చేయాలని రెండేళ్ల నుంచి కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ అమ్‌తుల్‌ గట్టిగా మాట్లాడటంతో ఫరూఖ్‌ విచక్షణ కోల్పోయారు. కాలిలోని చెప్పును తీసి అమ్‌తుల్‌ పైకి విసిరారు. దుర్భాషలాడుతూ, మెడ పట్టుకుని అక్కా తమ్ముడిని బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు న్యాయం చేయాలంటూ నాంపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఎమ్మెల్సీపై పలు కేసులు నమోదు చేశారు. మహిళపై ఫరూక్‌ దుర్భాషలాడిన, దాడికి యత్నించిన వీడియోను పరిశీలించారు. మరోవైపు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది.

నాపై వస్తున్న వార్తలన్నీ అబద్ధం: ఫరూక్‌
తనపై పలు టీవీ చానళ్లలో వచ్చిన వార్తలన్నీ అబద్ధమని ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌ చెప్పారు. తన ఇంటికి యూసఫ్‌ అలీ అనే వ్యక్తితో వచ్చిన మహిళ తనను పరుష పదజాలంతో దూషించిందని వివరించారు. ఆమె ఎవరో తనకు తెలియదని, ఇల్లు ఖాళీ చేయడం లేదంటూ తనను తిట్టడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరేళ్ల క్రితం మహ్మద్‌ సమద్‌ అనే వ్యక్తితో ఇంటిని అద్దెకు తీసుకున్నానని చెప్పారు.

నెలకు రూ.11,500 అద్దెకు ఒప్పందం కుదుర్చుకున్నానని, ప్రతీ నెల 5లోగా అద్దె చెల్లిస్తున్నాని వివరించారు. తనకు కబ్జాలు చేసే అలవాటు లేదని, కబ్జాలు చేసేవాడినైతే ఇప్పటికే సొంత ఇల్లు ఉండేదన్నారు. ఇల్లు ఖాళీ చేయమని తనకు ఎవరూ నోటీసు ఇవ్వలేదని, నోటీసు చూపిస్తే 24 గంటల్లో ఖాళీ చేస్తానన్నారు. మహిళలంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న మహిళ వెనక ఎవరో ఉన్నారనే అనుమానం కలుగుతోందన్నారు. 

మరిన్ని వార్తలు