రచ్చకెక్కిన ఇంటి గొడవ

8 Oct, 2018 09:44 IST|Sakshi

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

ఇరు వర్గాల వాగ్వాదం

ఇరువురిపై కేసులు నమోదు  

చిలకలగూడ : న్యాయస్థానంలో పెండింగ్‌లో భార్యభర్తల వివాదం రచ్చకెక్కింది. భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు భార్యభర్తలు ఇద్దరిపై న్యూసెన్స్‌ కేసులు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  పద్మారావునగర్‌కు చెందిన నికిల్‌కుమార్‌కు వరంగల్‌ గిర్మాజీపేటకు చెందిన అపర్ణతో 2016 ఆగస్టులో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. 

పెళ్లయిన కొద్దిరోజులకే  మనస్పర్ధలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. నికిల్‌కుమార్‌తోపాటు అతని కుటుంబసభ్యులు తమ కుమార్తెను వేధిస్తున్నారని అపర్ణ తల్లితండ్రులు వరంగల్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అనంతరం   విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో అత్తవారింట్లో ఉన్న  తన వస్తువులు, సర్టిఫికెట్లు ఇప్పించాలని అపర్ణ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఆదివారం న్యాయవాది, తల్లితండ్రులతో కలిసి పద్మారావునగర్‌లోని నికిల్‌కుమార్‌ ఇంటికి వచ్చింది. అత్తింటివారు ఆమె అల్మారా, ఇతర వస్తువులు ఇంటి బయట ఉంచారు.

అల్మారాలోని బంగారు ఆభరణాలు, సర్టిఫికెట్లు లేవని అపర్ణతోపాటు వారి బంధువులు నికిల్‌కుమార్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నికిల్‌కుమార్, అపర్ణలను స్టేషన్‌కు తరలించారు. ఠాణాలో నూ వారు వాగ్వాదానికి దిగడంతో ఇరువురిపై న్యూసెన్స్‌ కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి
తెలిపారు.

మరిన్ని వార్తలు