అవమాన భారంతో నర్సు ఆత్మహత్య

1 Mar, 2020 08:49 IST|Sakshi

రోగి డబ్బు రూ. 2 వేలు కనిపించలేదని నింద  

ఇంటి పైకప్పు దూలానికి ఉరేసుకుని మృతి

సాక్షి, మదనపల్లె టౌన్‌ :  రోగి వద్ద ఉన్న డబ్బు చోరీ చేసినట్లు నింద వేశారని.. అవమానం భరించలేక ఓ నర్సు ఆత్మహత్యకు పాల్పడింది. మదనపల్లెలో శనివారం జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. మృతురాలి తల్లిదండ్రులు, రూరల్‌ పోలీసుల కథనం మేరకు మదనపల్లె మండలంలోని పోతపోలు పంచాయతీ, వండాడి వారిపల్లెకు చెందిన రైతు వండాడి రాసప్ప, పార్వతమ్మ దంపతులకు నలురుగు ఆడబిడ్డలు. వారిలో మూడో కుమార్తె సాలమ్మ అలియాస్‌ సావిత్రి(24) బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసింది. పట్టణంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తోంది. రోజూ మాదిరిగానే రెండు రోజుల క్రితం విధులకు వెళ్లింది. తనకు బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో పని దొరికిందని.. తాను ఇక నుంచి ఆస్పత్రికి రానని డాక్టర్లతో సావిత్రి చెప్పింది.

ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ కూడా డాక్టర్‌ దగ్గర తీసుకుంది. ఇక నుంచి ఆస్పత్రికి వచ్చేది ఉండదని నైట్‌ డ్యూటీ కూడా చేసింది. ఆ రోజు ఆస్పత్రిలో అడ్మిట్లో ఉన్న ఓ రోగికి సేవలు చేసింది. ఆ రోగి తన వద్ద ఉన్న రూ. 2 వేలు కనిపించలేదని సావిత్రిని నిలదీసింది. అంతటితో ఆగకుండా సమస్యను సహచర సిబ్బంది, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. వారు ప్రశ్నించడంతో తాను అలాంటి తప్పు చేయలేదని సమాధానమిచి ఇంటికి వచ్చేసింది. అదే రోజు సాయంత్రం మళ్లీ ఆస్పత్రిలోని సిబ్బందికి ఫోన్‌చేసి  నగదు దొరికిందా...? అని సహచరులకు ఫోన్‌ చేసింది. లేదు.. నువ్వే తీసుకున్నావు..అని వారు చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. చదవండి: బావతో వివాహం.. తర్వాత ఎన్ని మలుపులో..!

ఆ మరుసటి రోజంతా ఇంటి నుంచి బయటకు రాలేదు. సూసైడ్‌ నోట్‌ను రాసిపెట్టింది. ఇంటి మొదటి అంతస్తులోకి వెళ్లి పైకప్పు కొయ్యకు తల్లి చీర కొంగుతో ఉరేసుకుంది. అమ్మమ్మ గోపాలమ్మ మనవరాలు భోజనానికి రాలేదని పిలవడానికి మిద్దెపైకి వెళ్లి చూసింది. వేలాడుతున్న మనవరాలి మృతదేహాన్ని చూసి కేకలు పెట్టింది. ఇరుగుపొరుగు వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు వెళ్లి మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ దిలీప్‌ కుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  

నేను ఏ తప్పూ చేయలేదు  

నర్సురాసిన సూసైడ్‌ నోట్‌  
‘అమ్మా..నేను ఏ తప్పూ చేయలేదు.. రోగి వద్ద డబ్బులు తీసుకోలేదు.. ఆ డబ్బు ఏమయిందో..? నాకు నిజంగానే తెలియ దు. రోగితో పాటు సహచర సిబ్బంది రూ. 2 వేలు రాత్రి డ్యూటీచేసే నర్సు ఎత్తుకుందని నాపై నిందవేశారు. ఏనాడూ.. ఏ తప్పూ చేయని నా మనసు గాయపడింది. ఆ నింద మోయలేక చచ్చిపోతున్నాను. నేను చనిపోయాక నా చావుకు కారణమైన వారి చెంప చెల్లుమనేలా కొట్టు,..ఆస్ప త్రిలోని డాక్టర్,. మేడమ్‌కు ఎటువంటి సంబంధం లేదు..’ అంటూ మృతురాలు రాసిన సూసైడ్‌ నోట్‌లోని విషయమిదీ.  చదవండి: కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి 

మరిన్ని వార్తలు