ప్రిన్సిపాల్‌ వేధింపులే కారణమా?

3 Jul, 2019 07:05 IST|Sakshi

నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి

సాక్షి, తిరుపతి (అలిపిరి): రుయాలో జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ మిట్‌వైఫరీ) ద్వితీయ సంవత్సరం విద్యార్థిని పౌజియా(19) మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ప్రభుత్వ నర్సింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ వేధింపులే ఆత్మహత్యాయత్నానికి కారణమని బాధితురాలు మీడియా ముందు గోడును వెళ్లబోసుకుంది. ప్రస్తుతం విద్యార్థిని ఆర్‌ఐసీయులో కోలుకుంటోంది.
 
ప్రిన్సిపాల్‌ వేధింపులు
దామలచెరువుకు చెందిన పౌజియా జీఎన్‌ఎం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. హాస్టల్లో వంటలు బాగుండడం లేదని ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో ప్రిన్సిపాల్‌ ఆమెను దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. ప్రిన్సిపాల్‌ ఇష్టానుసారంగా తిడుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నట్లు నర్సింగ్‌  విద్యార్థినులు ‘సాక్షి’ ఎదుట గోడును వెళ్లబోసుకున్నారు. తల్లిదండ్రుల గురించి తప్పుగా మాట్లాడడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నట్లు వివరించారు.

10 మందికి అపెండిసైటిస్‌ ఆపరేషన్లు
నర్సింగ్‌ హాస్టల్లో ఆహారం సరిగా లేదని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలల కాలంలో 60 మంది విద్యార్థినుల్లో 10 మందికి అపెండిసైటిస్‌ ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు. నాసిరకం భోజనం అందిస్తుండడం వల్లే అనారోగ్యం బారినపడుతున్నట్లు విమర్శలున్నాయి. పౌజియా ఆత్మహత్యాయత్నానికి ఇది కూడా ఓ కారణంగా విద్యార్థినులు చెబుతున్నారు.

విచారించి చర్యలు తీసుకుంటాం..
రుయాలో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి గల కారణాలపై విచారిస్తాం. విచారణలో తేలిన వివరాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రిన్సిపాల్‌ రష్యారాణి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులందాయి.    – డాక్టర్‌ సిద్ధానాయక్, సూపరింటెండెంట్, రుయా ఆస్పత్రి

నర్సింగ్‌ విద్యార్థినులు నా బిడ్డలతో సమానం
నర్సింగ్‌ విద్యార్థినులు నా బిడ్డలతో సమానం. వారి పట్ల నేను ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదు. కుటుంబ సమస్యల కారణంగా పౌజియా నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది. ఇందులో నాకు ఎటువంటి సంబంధమూ లేదు.         – రష్యారాణి, ప్రిన్సిపాల్, స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్, రుయా ఆస్పత్రి 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా