కొంపముంచిన జీడిపప్పు ఆశ

11 Apr, 2018 09:12 IST|Sakshi
డీడీ ఎస్‌టీనాయుడుని విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌ 

ఉచితంగా జీడిపప్పు ఇవ్వలేదని వ్యాపారిపై అక్రోశం

సేల్‌ పర్మిట్‌కు రూ.10 వేలు డిమాండ్‌ చేసిన మార్కెటింగ్‌ శాఖ డీడీ

ఈ నేపథ్యంలో లంచం  తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీడీ..

ఆయనకు సహకరించిన సూపర్‌వైజర్‌ అరెస్ట్‌

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): ఉచితంగా జీడిపప్పు పొందాలన్న కక్కుర్తి ఆ అధికారి కొంప ముంచేసింది. ఓ వ్యాపారికి జీడిపప్పు ప్యాకెట్‌ కోసం మార్కెటింగ్‌శాఖ డీడీ హుకుం జారీ చేస్తే మాట చెల్లలేదు. సరే నీ సంగతి చూస్తానని ఆ విషయం మనసులో పెట్టుకున్న సదరు అధికారి వద్దకు వ్యాపారి రానే వచ్చాడు. ఏం ఇన్నాళ్లకు గుర్తొచ్చానా... రూ.10 వేలు ఇస్తేనే సంతకం పెడతానని మెలిక పెట్టడంతో ఆ వ్యాపారి ఏసీబీ అస్త్రాన్ని సంధించి కటకటాల వెనక్కి పంపాడు.

అధికారికి సహకరించిన మరో ఉద్యోగి కూడా కటకటాల పాలయ్యాడు. గోపాలపట్నం మార్కెటింగ్‌ శాఖ కార్యాలయంలో చర్చనీయాంశమైన ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గోపాలపట్నంలో ఉన్న ప్రాంతీయ మార్కెటింగ్‌ శాఖ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఎస్‌టీ నాయుడు విధులు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందేందుకు జీడీపప్పు ఇవ్వాలని భావించాడు.

అందుకోసం కంచరపాలెం కేంద్రంగా విశాఖ, విజయవాడకు జీడిపప్పు అమ్మకాలు జరిపే జగన్నాథరావు అనే వ్యాపారిని కేజీ జీడిపప్పు పంపాలని కోరాడు. డబ్బులివ్వకుండా జీడిపప్పు ఇవ్వలేనని ఆ వ్యాపారి చెప్పేయడంతో నాయుడు సిగ్గుపడిపోయాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ ఒకటిన సేల్‌ పర్మిట్‌ పుస్తకం కోసం జగన్నాథరావు మార్కెటింగ్‌ శాఖ కార్యాలయానికి వచ్చాడు. జగన్నాథరావుని చూడగానే ఎస్‌టీ నాయుడుకి జీడిపప్పు సంగతి గుర్తొచ్చింది.

ఏం బాబూ... మా అవసరం ఇప్పుడొచ్చిందా... ఇపుడు నువ్వడిగింది ఇవ్వడానికి తీరిక లేదు... మళ్లీ రా అని రెండుమూడుమార్లు తిప్పారు. ఈ నెల 9న మళ్లీ కార్యాలయానికి వచ్చిన జగన్నాథరావు ఏమిస్తే సేల్‌ పర్మిట్‌ పుస్తకం ఇస్తారో చెప్పాలని అడగడంతో... రూ.10వేలు ఇవ్వాలని నాయుడు డిమాండ్‌ చేయడంతో సరేనని ఆ వ్యాపారి వెళ్లిపోయాడు. 


అనంతరం నేరుగా ఏసీబీ డీఎస్పీ కేవీ రామకృష్ణప్రసాద్‌ని ఆశ్రయించడంతో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో సీఐలు గొలగాని అప్పారావు, ఎస్‌.రమేష్, ఎస్‌కే గఫూర్, ఎంవీ రమణమూర్తి జగన్నాథరావుని పంపి ట్రాప్‌ చేశారు.

తెచ్చిన డబ్బులివ్వడానికి ప్రయత్నించిన జగన్నాథరావుని చూసి... సూపర్‌వైజర్‌ బంగారురాజుకి ఇచ్చి వెళ్లు అని ఎస్‌టీనాయుడు చెప్పడంతో ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేశారు. డబ్బులు తీసుకున్న బంగారురాజుతో పాటు ఎస్‌టీనాయుడుని అరెస్టు చేశారు. వీరి నుంచి వేలిముద్రలు తీసుకున్నారు.

ఎస్‌టీనాయుడు, బంగారురాజుని అరెస్టు చేశామని డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌ చెప్పారు.  ఏసీబీ దాడి జరిగిందన్న విషయం తెలియడంతో మార్కెటింగ్‌ శాఖ కార్యాలయానికి ఆ శాఖ జేడీ శ్రీనివాసరావు, ఏడీ కాళేశ్వరరావు  చేరుకున్నారు. వారి నుంచి డీడీ విధులు, ప్రవర్తనపై డీఎస్పీ వివరాలు సేకరించారు.   
 

>
మరిన్ని వార్తలు