అవినీతి అధికారుల ఆటకట్టు

29 May, 2019 07:38 IST|Sakshi
నిందితులు మియాపూర్‌ ఏడీఈ రమేష్, సబ్‌ ఇంజనీర్‌ పాండు

నగరంలో ఏసీబీ అధికారుల మెరుపు దాడులు

మియాపూర్‌లో లంచం తీసుకుంటున్న విద్యుత్‌శాఖ ఏడీఈ, సబ్‌ ఇంజినీర్‌ అరెస్ట్‌

అబిడ్స్‌లో సొంత శాఖ ఉద్యోగిని డబ్బులు డిమాండ్‌ చేసిన జలమండలి అధికారి ఆటకట్టు

విద్యుత్‌ మీటర్‌ కోసం డబ్బులు డిమాండ్‌..

నగరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు కొరడా ఝలిపించారు.మంగళవారం ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో డబ్బులు డిమాండ్‌ చేసిన ముగ్గురు అవినీతి అధికారులను అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి పంపారు. వివరాల్లోకి వెళితే..

మియాపూర్‌ : విద్యుత్‌ మీటర్‌ మంజూరుకుగాను డబ్బులు డిమాండ్‌ చేసిన మియాపూర్‌ ట్రాన్స్‌కో ఏడీఈ, సబ్‌ ఇంజినీర్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ రేంజ్‌ అధికారి డీఎస్పీ  సూర్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హెలియోస్‌ సోలార్‌ రూప్‌ ట్యాప్‌ ప్యానల్స్‌ సంస్థ మియాపూర్‌లోని భవ్య శ్రీ సూర్య అపార్ట్‌మెంట్‌లో సోలార్‌ రూప్‌ ట్యాప్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసేందుకుగాను సంస్థ ప్రతినిథి కిషోర్‌ నెట్‌ మీటర్‌ కోసం ఏడీఈ ధరావత్‌ రమేష్‌ను సంప్రదించాడు. ఇందుకు అతను రూ.3500 ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో కిషోర్‌ ఏసీపీ అధికారులను సంప్రదించాడు. ఏసీపీ అధికారుల సూచనమేరకు పథకం ప్రకారం మంగళవారం ఉదయం కిషోర్‌ ఏడీఈకి రూ.3500 నగదు ఇచ్చేందుకు కార్యాలయానికి రాగా, సబ్‌ ఇంజినీర్‌ పాండుకు ఇవ్వాలని సూచించాడు. దీంతో కిషోర్‌ పాండుకు డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్‌ ఇంజనీర్‌ పాండును విచారించగా ఏడీఈ రమేష్‌ సూచన మేరకే నగదు తీసుకున్నట్లు తెలిపాడు. దీంతో అధికారులు ఏడీఈని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో వారిద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో సీఐలు నాగేంద్రబాబు, రామలింగారెడ్డి, గంగాధర్, మజీద్‌ అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

2008లోనే అరెస్ట్‌
గోదావరిఖనికి చెందిన దరావత్‌ రమేష్‌  గతంలో బాచుపల్లి ఏఈగా, ఎర్రగడ్డలో  మాస్టర్‌ ప్లాన్‌ అధికారిగా విధులు నిర్వహించారు. మూడు నెలల క్రితం మియాపూర్‌ మదీనాగూడలోని సబ్‌ స్టేషన్‌లోని ఏడీఈగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2008లో బాచుపల్లిలో ఏఈగా పనిచేస్తుండగా రూ.2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఏసీబీకి చిక్కినజలమండలి అధికారి
అబిడ్స్‌: ఓ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటున్న జలమండలి అకౌంట్స్‌ విభాగం సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జలమండలి మొగల్‌పురా సెక్షన్‌లో బొల్లిశ్రీహరి జనరల్‌ పర్పస్‌ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతను గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనం, పీఆర్‌సీ బకాయిల కోసం గోషామహాల్‌ జలమండలి అకౌంట్‌ సెక్షన్‌లో సూపరింటెండెంట్‌ మహ్మద్‌ అహ్మద్‌ను సంప్రదించాడు. బిల్లు మంజూరు చేసేందుకు అహ్మద్‌తో రూ. 4 వేలు డిమాండ్‌ చేశాడు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచన మేరకు మంగళవారం శ్రీహరి అహ్మద్‌కు రూ. 4 వేలు నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.4 వేలు స్వాధీనం చేసుకుని ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.

మరిన్ని వార్తలు