టార్చర్ చూపిస్తున్నారు: 9/11 నిందితుడు

6 Feb, 2018 12:15 IST|Sakshi

వాషింగ్టన్: తనను మానసికంగా ఎంతగానో వేధిస్తున్నారంటూ 9/11 దాడుల నిందితుడు, ఫ్రాన్స్‌కు చెందిన జకారియస్ మౌసాయ్ ఆరోపించాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తనను కొలరెడోలోని ఉన్నతస్థాయి సెక్యూరిటీ జైలులో ఉంచారని పేర్కొన్న నిందితుడు నాలుగు పేజీల ఫిర్యాదు లేఖను రాసినట్లు సమాచారం. గత డిసెంబర్‌లో రాసిన ఈ లేఖ ఇటీవల వెలుగుచూసింది.

'ట్రంప్ ప్రభుత్వం మానసిక వేదనకు గురి చేస్తోంది. నా బాధను బయటి ప్రపంచానికి చెప్పుకోవాలనుకుంటున్నా. లాయర్‌ ఏర్పాటు చేసుకునే వీలు కల్పిస్తే ఆయన ద్వారా 9/11 దాడుల గురించి కొన్ని నిజాలు చెప్పాలని భావిస్తున్నా. కానీ ట్రంప్ ప్రభుత్వం, అమెరికా జైళ్ల శాఖ అందుకు అనుమతించకుండా నన్ను చిత్ర హింసలు పెడుతోంది. గతంలోనూ దాఖలు చేసుకున్న అన్ని పిటిషన్లను తిరస్కరించిన కోర్టు.. చివరిగా 2006లో కేసు విచారణ తర్వాత నాకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కానీ 2001 అల్‌ఖైదా ఉగ్రదాడికి సంబంధించి నిజాలు చెప్పేందుకు నాకు అవకాశం ఇవ్వాలంటూ' తన లేఖలో నిందితుడు, 20వ హైజాకర్ అయిన జకారియస్ మౌసాయ్‌ రాసుకొచ్చాడు.

మరోవైపు తాజాగా అతడు రాసిన ఫిర్యాదు లేఖలో సౌదీ అరేబియాకు చెందిన రాజుల కుటుంబాలు ఉగ్రసంస్థ అల్‌ఖైదాకు ఆర్థిక సహకారం అందించాయని ఆరోపించాడు. కాగా, అమెరికా అధికారులు, సౌదీ రాజ వంశీయులు ఆ ఆరోపణల్ని తోసిపుచ్చారు. తాజా పిటిషన్‌లో తన పేరును 'అల్లాకు బానిస (స్లేవ్ ఆఫ్ అల్లా)' అని నిందితుడు జకారియస్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

విమానాలను హైజాక్ చేసి 2001, సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రసంస్థ దాడికి పాల్పడ్డ ఘటనలో 3000కు పైగా ప్రజలు మృతిచెందిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల తర్వాత అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా బలగాలు మట్టుపెట్టి ప్రతీకారం తీర్చుకున్నాయి. విచారణ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరిన్ని వార్తలు