అక్రమ వెంచర్లపై కొరడా

28 Jun, 2018 12:48 IST|Sakshi
అక్రమ వెంచర్లలో రాళ్లను తొలగిస్తున్న సర్పంచ్, అధికారులు 

అడ్డాకుల శివారులో హద్దురాళ్లను తొలగించిన అధికారులు 

అడ్డాకుల (దేవరకద్ర): మండల కేంద్రం శివారులో అక్రమంగా వెలచిన అక్రమ వెంచర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించిన వాటిపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

ఇంతకు ముందు కూడా అధికారులు చర్యలు చేపట్టినా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన 10శాతం స్థలాలను కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో మరోసారి అధికారులు ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో బుధవారం అడ్డాకుల శివారులోని సర్వే నంబర్‌ 16, 131, 132లలో ఏర్పాటు చేసిన వెంచర్లపై అధికారులు చర్యలు మొదలుపెట్టారు. గ్రామ పంచాయతీకి స్థలాలకు కేయించకుండా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేయడంతో అధికారులు ఇంతకు ముందు నోటీసులు జారీ చేశారు.

అయినా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు స్పందించకపోవడంతో సర్పంచ్‌ రఘు, పంచాయతీ కార్యదర్శి జయవర్ధన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ భీమన్నయాదవ్‌ జేసీబీ సాయంతో హద్దురాళ్లను తొలగించారు.

అనుమతి లేని ప్లాట్లను ఎవరైనా కొనుగోలు చేస్తే ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వబోమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే ప్లాట్లను విక్రయించాలని నిర్వాహకులకు సూచించారు. లేదంటే కొనుగోలుదారులు నష్టపోతారని చెప్పారు.  

విమానాశ్రమం వస్తుందని..! 

అడ్డాకుల, గుడిబండ గ్రామాలకు సమీపంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండటంతో ప్లాట్ల ధరలకు రెక్కలు వచ్చాయి. గతం కంటే రెట్టింపు ధరలకు దళారులు ప్లాట్లను విక్రయిస్తున్నారు.

అయితే ఎలాంటి అనుమతులు లేకుండా వెలసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు నష్టపోయే అవకాశం ఉన్నందున ఎవరూ వాటిని కొనుగోలు చేయవద్దని అధికారులు కోరుతున్నారు. విమానాశ్రయం ఏర్పాటు అవుతుందన్న సాకుతో అక్రమ వెంచర్లలోని ప్లాట్లను విక్రయిస్తే వాటిని కొనుగోలు చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు