దారి మళ్లిన ఓలా, తప్పించుకున్న మహిళ!

6 Jul, 2018 16:02 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు: సురక్షిత ప్రయాణానికి హామీ అంటూ ఊదరగొట్టే ప్రయివేటు క్యాబ్‌ సర్వీసులు ప్రయాణీకుల భద్రత విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మహిళల పట్ల క్యాబ్‌ డ్రైవర్ల అకృత్యాలకు అడ్డులేకుండా పోతోంది. తాజాగా.. ఓలా క్యాబ్‌లో ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన ఓ మహళపై క్యాబ్‌ డ్రైవర్‌ అఘాయిత్యం చేయాలని చూశాడు. పోలీసుల తెలిపిన వివరాలు.. బనాస్‌వాడిలో నివాసముండే ఓ మహిళ గురువారం ఉదయం ఓలా క్యాబ్‌లో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రాయానికి బయలుదేరారు. వాహనం ఎయిర్‌పోర్టును సమీపించగానే ఒక్కసారిగా డ్రైవర్‌ వాహనాన్ని మరో మార్గంలోకి మళ్లించాడు.

వాహనం హైదరాబాద్‌ వైపుగా దూసుకుపోతుండడంతో మహిళ  డ్రైవర్‌ని ప్రశ్నించింది. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్‌, నోరు తెరిస్తే చంపేస్తానని బెదిరించాడని పోలీసులు తెలిపారు. అయితే, వాహనం ఓ టోల్‌ ప్లాజాను దాటి వెళ్తున్న సమయంలో మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడున్న టోల్‌ ప్లాజా సిబ్బంది అప్రమత్తమయ్యారు. క్యాబ్‌ను అడ్డగింగి ఆమెను కాపాడారని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్‌ ఫూటుగా తాగి ఉన్నాడని.. అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చిక్కజలా ఎస్సై తెలిపారు. ఈ వ్యవహారంపై ఓలా సంస్థ స్పందిచింది. డ్రైవర్‌ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

మరిన్ని వార్తలు