ఎఫ్‌బీలో స్నేహితుడై.. ఆపై వెంటపడి..

21 Feb, 2018 09:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వివాహితను వేధించిన లాయర్‌ను లంగర్‌హౌజ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.  చార్మినార్‌ ఖిల్వాత్‌ ప్రాంతానికి చెందిన లాయర్‌ మీర్జా మౌజం బైగ్‌ (31)పై లంగర్‌హౌజ్‌కు చెందిన 33 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. మొదట ఫేస్‌బుక్‌లో పరిచయమైన బైగ్‌.. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలిశాడని, ఇప్పుడు తనను లైంగికంగా వేధిస్తూ వెంటాడుతున్నాడని ఆమె ఫిర్యాదులో తెలిపింది.

ఈవెంట్‌ మేనేజర్‌ కావడం వల్ల వృత్తిపరంగా తాను బైగ్‌తో కలిసి కొన్ని పార్టీలకు హాజరయ్యానని, ఈ క్రమంలో అతను తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించాడని, అతడు స్నేహితులతో కలిసి ఫేస్‌బుక్‌లో తనకు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నాడని ఆమె తెలిపింది. బైగ్‌ యూత్‌ కాంగ్రెస్‌ నేతగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.

‘అతను ఆమె వ్యక్తిగత సమాచారం సేకరించి.. తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆమెను బలవంతపెట్టాడు. అందుకు ఆమె నిరాకరించడంతో వేధించడం మొదలుపెట్టాడు’ అని పోలీసులు తెలిపారు. బైగ్‌ తన స్నేహితులు జీషాల్‌ అలీ ఖాన్‌, మెహ్రాజ్‌ పటేల్‌, మహ్మద్‌ లుఖ్మన్‌లతో ఆమె వ్యక్తిగత విషయాలు చర్చించి.. వారి ద్వారా ఆమె గురించి పుకార్లు వ్యాప్తి చేశాడని, అంతేకాకుండా తన స్నేహితుడు షైక్‌ అహ్మద్‌ పర్వేజ్‌ ద్వారా బాధితురాలి భర్తకు ఈ పుకార్లు చేరవేశాడని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు మేరకు బైగ్‌ను విచారణకు పిలిచామని, హాజరుకాకపోవడంతో మంగళవారం అరెస్టు చేశామని తెలిపారు. అయితే, తనకు అస్వస్థతగా ఉందని అతను ఆస్పత్రిలో చేరాడని, అనంతరం పోలీసులు తనను విచారణ సందర్భంగా కొట్టారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు.

మరిన్ని వార్తలు