తెల్లారేసరికి విగతజీవులుగా..

23 Jul, 2019 10:58 IST|Sakshi
ఇంట్లో వృద్ధ దంపతుల మృతదేహాలు

వీరి మృతిపై పలు అనుమానాలు

సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ

ఇంటి చుట్టూ కలియ తిరిగిన డాగ్‌ స్క్వాడ్‌

సాక్షి, దర్శి (ప్రకాశం): పట్టణంలోని అద్దంకి రోడ్డు సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న అన్నపురెడ్డి వెంకటరెడ్డి (70), ఆదెమ్మ (51)  దంపతులు ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వెంకటరెడ్డి, ఆదెమ్మ దంపతులు ఆదివారం రాత్రి ఇంటి వెనుక వైపు రేకుల పంచలో పడుకుని నిద్రపోయారు. వారి కుమారుడు నారాయణరెడ్డి ఇంటి ముందు పంచలో పడుకున్నాడు. తెల్లవారి లేచే సరికి వెంకటరెడ్డి, ఆదెమ్మలు అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించారు. కుమారుడు పోలీసులకు సమాచారం అందించారు.

వెల్లువెత్తుతున్న అనుమానాలు 
వెంకటరెడ్డి దంపతులు వెనుక వైపు రేకుల పంచలో పడుకున్నారు. అయితే వారి మృతదేహాలు ఇంట్లో ఉన్నాయి. మంచంపై ఆదెమ్మ మృతదేహం ఉండగా నేలపై వెంకటరెడ్డి మృతదేహం కనిపించింది. బయట రేకుల పంచలో పడుకున్న ప్రాంతంలో రక్తం మరకలు కనిపించాయి. రక్తాన్ని తుడిచిన వస్త్రం ఆ ప్రాంతంలోనే పడి ఉంది. ఆదెమ్మ చేతి మణికట్టు వద్ద మారణాయుధంతో కోసినట్లు కనిపిస్తోంది. వెంకటరెడ్డి తలపై కొట్టిన గాయం, మెడపై, చేతి మణికట్టు వద్ద కోసిన గాట్లు కనిపిస్తున్నాయి. కుమారుడు బయట పడుకుని ఉండగానే నివాసంలోకి వెళ్లి ఎవరు హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెనుక వైపు ఉన్న బీరువా తలుపు తెరిచి ఉంది.

దీన్ని బట్టి డబ్బు కోసం బయటే హత్య చేసి మృతదేహాలు లోపలకు తీసుకొచ్చి పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వృద్ధులకు హత్యతో ఉపయోగం ఎవరికి ఉంటుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరెడ్డి తలపై గాయాలు ఉండటంతో ఇది హత్యే అన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతుడికి ఆదెమ్మ రెండో సంబంధం. వారి కుమారుడే నారాయణరెడ్డి. నారాయణరెడ్డికి వివాహామై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వెంకటరెడ్డి దంపతులు తమ స్వగ్రామం మర్లపాలెం వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

మృతుల పేరుపై ఎటువంటి పొలం, ఆస్తులు లేవని స్థానికులు చెప్తున్నారు. వృద్ధ దంపతులు అన్యోన్యంగా ఉంటారని స్థానికులు చెప్తున్నారు. డీఎస్పీ కె.ప్రకాశ్‌రావు, సీఐ మహ్మద్‌ మొయిన్, ఎస్‌ఐ ఆంజనేయులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుమారుడు నారాయణరెడ్డి నుంచి పోలీసు అధికారులు పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు నుంచి డాగ్‌ స్క్యాడ్‌  వచ్చి ఇంటి చుట్టూ కలియతిరిగింది. క్లూస్‌ టీమ్‌ వచ్చి ఆధారాలు సేకరించింది.

మరిన్ని వార్తలు