గొంతుకోసి వృద్ధుడి హత్య

21 Apr, 2018 09:26 IST|Sakshi
నాగులు మృతదేహం

మనుమడిపై పోలీసుల అనుమానం

పర్చూరు మండలం చెరుకూరులో ఘటన..

పర్చూరు : ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని చెరుకూరులో గురువారం రాత్రి జరిగి ఉంటుందని భావిస్తుండగా శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిన నాగులు (80) గతంలో ముఠా మేస్త్రీగా పనిచేశాడు. ఎంతో మందికి ఉపాధి చూపాడు. ఆయన మనుమడు బోయిన గోపీ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు.

గోపీ తరుచూ మద్యం కోసం ఇంట్లో డబ్బులు అడిగేవాడు. ఇవ్వకుంటే కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. గోపీ తల్లి ఇందిర గతంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో కూడా కుమారుడిపై ఫిర్యాదు చేసింది. కొడుకు ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో తల్లిదండ్రులు వేరే ఊరులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గోపి తన భార్య బంగారు గొలుసు తీసుకొని బాపట్లలో తాకట్టు పెట్టేందుకు వెళ్లాడు. అతడి తల్లి షాపు యజమానికి ఫోన్‌ చేసి తాకట్టు పెట్టుకోవద్దని చెప్పింది.

వేరొక షాపులో తాకట్టు పెట్టి రూ.20 వేలు తీసుకొకున్నాడు. అందులో రూ.10 వేలతో సెల్‌ఫోన్‌ కొన్నాడు. మిగిలిన డబ్బుతో మద్యం తాగుతున్నాడు. గురువారం రాత్రి గోపీ, తాత నాగులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇంతలో తాత నాగులు గొంతు కోసి దారుణ హత్యకు గురయ్యాడు. సీఐ ఎం.శేషగిరిరావు మాట్లాడుతూ మనుమడు గోపి మద్యానికి బానిసై నిద్రపోతున్న తాత నాగులును గోంతుకోసి చంపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.

సంఘటన స్థలాన్ని చీరాల డీఎస్పీ డాక్టర్‌ ప్రేమ్‌కాజల్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి కొడలు ఇందిర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీఐ శేషగిరిరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు