కొడుకులు పట్టించుకోవడం లేదని..

26 Sep, 2019 08:32 IST|Sakshi

సాక్షి, రామగుండం : కనీ పెంచిన కొడుకులను పెద్ద చేసి ప్రయోజకులుగా చేసిన తనను పట్టించుకోవడం లేదని వృద్ధుడు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అటువైపుగా వెళ్తున్న వారు గమనించి తాడుతో బయటకు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ సంఘటన బుధవారం గోదావరిఖనిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల సంజీవరెడ్డి (90)కి నారాయణరెడ్డి, నర్సింహారెడ్డి కొడుకులు.

కొన్నేళ్లక్రితం సంజీవరెడ్డి భార్య మృతిచెందగా, వృద్ధాప్యంలో ఇద్దరు కొడుకుల వద్దే జీవనం సాగిస్తున్నాడు. సంజీవరెడ్డి పేరుతో ఉన్న 20 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.3 లక్షల నగదు కొడుకులకు సమానంగా ఇచ్చాడు. అప్పటివరకు బాగానే చేరదీసి తిండిపెట్టిన వారు, భూమి పంపకాల అనంతరం పట్టించుకోకుండా తిండికూడా పెట్టలేదని సంజీవరెడ్డి వాపోయాడు. ఎక్కడైనా గంగలోకి దూకి చావమంటూ ఉచిత సలహా ఇవ్వడంతో ఏమిచేయాలో తోచక బుధవారం గోదావరిఖనిలోని గోదావరి నది వద్దకు చేరుకున్నాడు.

బ్రిడ్జి పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కొందరు  తాడు అందించి పైకిలాగి పోలీసులకు సమాచారం అందించారు. గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, టూటౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధుడిని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొడుకులను పిలిచించి కౌన్సెలింగ్‌ చేసి వారికి అప్పగిస్తామని తెలిపారు. 

బ్రిడ్జిపై కంచె ఏర్పాటు చేస్తాం.. 
గోదావరి నదిపై నుంచి దూకి పలు ఆత్మహత్య ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి బ్రిడ్జిపై నుంచి ఎవరూ దూకకుండా ఇరువైపులా ఇనుప కంచె ఏర్పాటు చేయిస్తాం. కంచె ఏర్పాటుపై మున్సిపల్, ఎన్టీపీసీ అధికారులతో చర్చలు జరిపి త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తాం. ఆయాప్రాంతాలలో పోలీస్‌ పెట్రోలింగ్, బ్రిడ్జిపై పోలీస్‌ ఔట్‌పోస్టింగ్‌ ఏర్పాటు చేయిస్తాం. ఏవైనా కుటుంబపరమైన గొడవలు జరిగితే పోలీసులను సంప్రదించి పరిష్కారమయ్యేలా చూసుకోవాలని ఏసీపీ కోరారు.  
– ఉమేందర్, గోదావరిఖని ఏసీపీ  

మరిన్ని వార్తలు