గొంతు కోసి చంపేశాడు

14 Mar, 2020 13:10 IST|Sakshi
శ్యామల మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ మసూమ్‌ బాషా, సీఐ రాజశేఖర్, తదితరులు

వృద్ధురాలి దారుణ హత్య

బంగారు ఆభరణాల చోరీ

ముమ్మిడివరం: ముమ్మిడివరంలో పట్టపగలు ఓ వృద్ధురాలి గొంతు కోసి అగంతకుడు బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. స్థానిక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం పక్కనున్న వీ«ధిలో విద్యుత్‌ శాఖలో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన విత్తనాల సత్యనారాయణ, అతని భార్య శ్యామల (65) నివాసం ఉంటున్నారు. సత్యనారాయణ శుక్రవారం ఉదయం నేరెళ్లపాలెంలో జరిగిన ఓ వివాహానికి వెళ్లగా శ్యామల ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని అగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి శ్యామల గొంతును కత్తితో కోసి మెడలోని బంగారు పుస్తెల తాడు, నల్ల పూసలు అపహరించుకు పోయాడు. ఇంటికి పని మనిషి వచ్చి ఎంత పిలిచినా రాకపోవడంతో తలుపులు తట్టి చూడగా మంచంపై నెత్తుటి మడుగులో శ్యామల పడి ఉండటాన్ని గమనించింది. ఈ విషయాన్ని చుట్టు పక్కల వారికి తెలియజేయడంతో వారు వైద్యుడిని పిలిచారు. ఆమె అప్పటికే మరణించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ నుంచి క్లూస్‌ టీం వచ్చి వేలు ముద్రలు సేకరించింది. అమలాపురం డీఎస్పీ మసూమ్‌ బాషా, ముమ్మిడివరం సీఐ బి.రాజశేఖర్, ఎస్సై ఎం.పండుదొర సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.   

మరిన్ని వార్తలు