పోలీసుల తనిఖీల్లో రూ.కోటి స్వాధీనం

20 Feb, 2019 07:00 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ రాథేష్‌ మురళి

టోల్‌ప్లాజా వద్ద కారులో పట్టుబడిన నగదు

డీఎస్పీ రాథేష్‌ మురళి వెల్లడి

పశ్చిమగోదావరి, టంగుటూరు: టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద  జరిపిన వాహనాల తనిఖీల్లో షిఫ్ట్‌ కారు నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ రాథేష్‌ మురళి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి వాహనాల తనిఖీల్లో పట్టుపడిన నగదు గురించి విలేకరుల సమావేశంలో వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్‌ కు చెందిన జయదేవ్‌ జ్యూయలరీలో పనిచేస్తున్న ఆనందరావు, రాజేష్‌లు తమ యజమాని ఆదేశాల ప్రకారం మొదట విజయవాడలో భరత్‌ అనే వ్యక్తి వద్ద కోటి రూపాయల నగదు తీసుకుని చెన్నై వెళ్లి అక్కడ బంగారం కోనుగోలు చేయాల్సి ఉంది.

అయితే మార్గంమధ్యలో షాపు యజమాని ఫోన్‌ చేసి భరత్‌ వద్ద తీసుకున్న నగదును నెల్లూరు లోని భాస్కర్‌ అనే వ్యక్తికి ఇవ్వమని ఆదేశించాడు. ఈలోగా భాస్కర్‌ కూడా షాపు సిబ్బందికి ఫోన్‌ చేసి నెల్లూరు లో సింహపురి హోటల్‌ వద్దకు రాగానే తనకు సమాచారం అందించాలని తాను అక్కడికి వచ్చి డబ్బు తీసుకుంటానని తెలిపాడు. అయితే అజ్ఞాతవ్యక్తి ఫోన్‌ చేసి కారులో రవాణా చేయకూడనిది ఏదో చేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వెంటనే టంగుటూరు ఎస్‌ఐ సీహెచ్‌ హజరత్తయ్యను అప్రమత్తం చేసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఆ తనిఖీలో కోటి రూపాయలు నగదు దొరికిందని డీఎస్పీ తెలిపారు. ఆ కారు డిక్కీలో సీక్రెట్‌ గా ఏర్పాటు చేసిన లాకర్‌లో ఈ డబ్బును తరలిస్తున్నారని తమ సిబ్బంది ఈ కారును క్షుణ్ణంగా పరిశీలించడంతో లాకర్‌ను గుర్తించారని వివరించారు. ఈ నగదు ఇన్‌కంటాక్స్‌ అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ ప్రభాకర్, జరుగుమల్లి ఎస్‌ఐ సోమశేఖర్, హెడ్‌ కానిస్టేబుల్‌ కోటేశ్వరరావు, కానిస్టేబుల్‌ శ్రీను, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు