రూ.కోటి హవాలా నగదు స్వాధీనం

13 Jun, 2019 02:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరం నుంచి కడపకు తరలించడానికి ప్రయత్నించిన రూ.కోటి హవాలా డబ్బును మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన జితేంద్రనాథ్‌ నగరంలో డ్రైఫ్రూట్స్‌ కమీషన్‌ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడి సోదరుడు కొన్నేళ్ళుగా ఢిల్లీ కేంద్రంగా హవాలా దందా చేస్తున్నాడు. ఈ వ్యాపారంలో లాభాలు ఎక్కువగా ఉంటాయని తెలుసుకున్న జితేందర్‌ తన స్నేహితుడైన కార్పెంటర్‌ సురేష్‌ శర్మ సాయంతో బేగంబజార్‌ కేంద్రంగా అదే దందా ఏర్పాటు చేశాడు. రూ.లక్షకు రూ.600 నుంచి రూ.800 వరకు కమీషన్‌ తీసుకుంటూ నగదు అక్రమ రవాణా, మార్పిడికి సహకరిస్తున్నాడు. కడపకు చెందిన సీఆర్‌ అసోసియేట్స్‌ యజమాని చరణ్‌తేజ్‌ నాయుడు కోరిన మీదట జితేందర్, సురేష్‌లు రూ.1,01,80,000 నగదు సమీకరించారు. దీన్ని వీరిద్దరితో పాటు సీఆర్‌ అసోసియేట్స్‌కు చెందిన లక్ష్మీనారాయణ, బాలకృష్ణ ద్విచక్ర వాహనాలపై బేగంబజార్‌ నుంచి తరలించడానికి ఉపక్రమించారు.  సమాచారం అందుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీçసుకుని, తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించింది. 

మరిన్ని వార్తలు