శిరీష హత్య కేసులో కొత్తకోణం

14 May, 2018 17:04 IST|Sakshi

సాక్షి, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి మండలంలోని ప్రగతి రిసార్టులో జరిగిన శిరీష హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మజిద్‌ అనే యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సాయిప్రసాద్‌ స్వగ్రామమైన కొత్తూరు మండలం తిమ్మాపురం వాసిగా గుర్తించారు. మజీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సహకరించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. శిరీష, ఆమె ప్రియుడు సాయిప్రసాద్‌ను మజీద్‌ కారులోనే ప్రగతి రిసార్ట్స్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించారు.

ఈ హత్య కేసులో మొదట సాయిప్రసాద్‌ మాత్రమే నిందితుడని పోలీసులు భావించారు. అయితే హత్య అనంతరం సాయిప్రసాద్‌ కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయడంతో మజీద్‌ విషయం తెలిసింది. శిరీషను హత్య చేసిన అనంతరం నిందితుడు సాయి మొదటగా మజీద్‌కే ఫోన్‌‌ చేసి విషయం చెప్పినట్లు విచారణలో తేలింది. పోలీసులకు సమాచారం అందించకుండా మజీద్‌ అక్కడ నుంచి కారులో పారిపోయినట్లు తేలడంతో అతడిని అరెస్ట్‌ చేశారు. మజిద్‌ నుంచి ఫోర్డ్‌ కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, కొత్తూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన సాయిప్రసాద్, అదే మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన శిరీష(21) పరిచయస్తులు. గతంలో వీరు ప్రేమించుకున్నారు. అయితే, కొంతకాలంగా శిరీష సాయిప్రసాద్‌కు దూరంగా ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిప్రసాద్‌ ఆమెపై ఒత్తిడి తీసుకురాగా యువతి నిరాకరించింది. దీంతో అతడు శిరీషపై కక్ష పెంచుకున్నాడు.

తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలని పథకం వేశాడు. గత గురువారం శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్టులో ఆన్‌లైన్‌లో గది బుక్‌ చేశాడు. అయితే, పథకం ప్రకారం సాయిప్రసాద్‌ తనతో ఓ కత్తి తెచ్చుకున్నాడు. నిర్వాహకులు ఎలాంటి తనిఖీలు చేయలేదు. వారి గుర్తింపు కార్డులను సైతం చెక్‌ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గదిలోకి వెళ్లిన తర్వాత సాయిప్రసాద్‌ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో శిరీష నిరాకరించింది. దీంతో అతడు కత్తితో ఆమె గొంతు కోసం చంపేశాడు. నిర్వాహకులు గుర్తించేసరికి పారిపోయాడు. అనంతరం పోలీసులు బృందాలుగా ఏర్పడి అతడిని మరుసటి రోజు చిలుకూరు చౌరస్తాలో పట్టుకొని కటకటాల వెనక్కి పంపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా