చలానాతో.. పోయిన బైక్‌ తిరిగొచ్చింది!

5 Dec, 2019 12:17 IST|Sakshi

సాక్షి, ఆదోని: జరిమానా అంటే సహజంగా బాధ కలిగించే విషయమే. అయితే కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన పురుషోత్తంకి మాత్రం జరిమానా ఖుషీ కలిగించింది. అదెలాగంటే... పట్టణానికి చెందిన పురుషోత్తం 2018 మార్చిలో ఎస్కేడీ కాలనీలోని తన గది ముందు హీరో స్ప్లెండర్‌ బైక్‌ నిలిపి ఉంచాడు. కొద్దిసేపటికే అది అపహరణకు గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది గడిచినా బైక్‌ ఆచూకీ దొరకలేదు. ఇక దొరకదేమోనని ఆశ వదులుకున్నాడు. అయితే మూడు రోజుల క్రితం తన సెల్‌ఫోన్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై ముగ్గురు ప్రయాణం చేస్తూ పట్టుబడినందున, నిర్ణీత కాల వ్యవధిలో రూ.1,235 జరిమానా చెల్లించాలని అందులో ఉంది. వెంటనే ఈ విషయం టూటౌన్‌ సీఐ అబ్దుల్‌ గౌస్‌ దృష్టికి తీసుకెళ్లాడు. సీఐ స్పందించి మెసేజ్‌ ఏ పోలీసు స్టేషన్‌ పరిధి నుంచి వచ్చిందో గుర్తించి.. కోసిగి పోలీసులను సంప్రదించారు. వారు బైక్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిని సీఐ వద్దకు పంపించారు.  ఏడాది తరువాత తన బైక్‌ తిరిగి దక్కడంతో పురుషోత్తం సంతోషం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు