పైసా వసూల్‌!

3 Oct, 2017 08:11 IST|Sakshi

ఒంగోలులో టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల చేతివాటం

అయిన వారికి ఆకుల్లో..కాని వారికి కంచాల్లో వడ్డింపు

లంచాలు ఇస్తే ఆక్రమణలు, అక్రమ కట్టడాలకు సై

వ్యక్తిగత తగాదాల్లోనూ లోపాయికారీగా మద్దతు

సామాన్య ప్రజలకు అందించే సేవల్లో జాప్యం

ఇటీవలే టౌన్‌ప్లానింగ్‌ ఉద్యోగిపై ఏసీబీ దాడి

అయినా మారని తీరు

ఒంగోలు నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం (టౌన్‌ ప్లానింగ్‌) అధికారులు, సిబ్బంది దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారు. భవన నిర్మాణ అనుమతులు, ఆక్రమణలు, ఆక్రమ కట్టడాలు, పబ్లిసిటీ ఫ్లెక్సీలు ఇలా..పలు అంశాల్లో పైసానే పరమావధి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. విభాగ అ«ధిపతి నుంచి చైన్‌మెన్‌ వరకు అందరిదీ అదే దారి. రోజువారీ కలెక్షన్లు, టార్గెట్లు పెట్టుకొని మరీ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్లు కూడా వ్యవహరిస్తున్నారు.

ఒంగోలు అర్బన్‌:
నగరంలోని విలేకరుల కాలనీ, ఇందిరా కాలనీ, కర్నూలు రోడ్డు, 60 అడుగుల రోడ్డు వంటి ప్రధాన రోడ్లలో అనుమతులు మీరి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలు చాలానే ఉన్నాయి. అయినా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరపాలక సంస్థకు చెందిన తాగునీటి పైపులైన్లు ఉన్న చోట్ల కొంతమంది ఆక్రమించి మరీ వ్యాపార సముదాయలు నిర్మించారు. చివరకు పక్కపక్కనే ఉండే రెండు భవనాల యజమానుల మధ్య తలెత్తే తగాదాల్లో సైతం వీరి తలదూర్చుతున్నారు. ఒకరికి లోపాయికారిగా అండగా ఉంటున్నారు. అవతలి వ్యక్తి భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం, నిర్మించిన భవనాలను కూలగొట్టడం దగ్గరుండి చేస్తున్నారు.

ఇక్కడ మరీ దారుణం
నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు వీల్లేని బాపూజీ కాంప్లెక్స్‌ పై అంతస్తులో వందల సంఖ్యలో గదులు నిర్మిస్తుంటే పట్టించుకున్న దాఖాలాలు లేవు.  కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్న భనాలను సైతం కూలదోసిన ఘటనలు లేకపోలేదు. మూడు నెలల క్రితం అనధికారిక భవనాల పేరుతో 21 భవనాలు తొలగించారు. అయితే ఎటువంటి పలుకుబడి లేని వాళ్ల భవనాలను భారీగా కూలదోసి, పలుకుబడి ఉన్న భవనాలను నామమాత్రంగా రంధ్రాలు వేసి వదిలేశారు. అదే సామాన్య ప్రజలు ఒక చిన్న ఇల్లు నిర్మించుకుంటే అనుమతులు లేవని, అక్రమ కట్టడాలు తొలగిస్తున్నామని ప్రకటనలు చేసే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు బహుళ అంతస్తుల భవనాలు, పెద్ద భవనాలు, వ్యాపార సముదాయాలు వంటి నిర్మాణాల్లో అ«ధికార పార్టీ నేతల సిఫార్సులు, మాముళ్లు ఉంటే ఆ వైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

చిరు వ్యాపారులపై కొరడా
నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామంటూ రోడ్డు మార్జిన్లలో చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారిపై కొరడా ఝుళిపించడం ఆనవాయితీగా మారింది. చివరకు రోడ్డు విస్తరణ పనుల్లోనూ సమన్యాయం పాటించడం లేదు. పలుకుబడి, డబ్బు ఉన్న వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దానికి ఉదాహరణే కర్నూలు రోడ్డు విస్తరణలో రోడ్డు అష్ట వంకర్లు తిరగటం. రెండు నెలల నుంచి కమ్మపాలెం రోడ్డు విస్తరణ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత రోడ్డు విస్తరణను కుదించి ఒక వైపే భవనాలు తొలగిస్తామని అధికారులు చెప్పారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఓ గుమాస్తాపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన వద్ద కోట్లాది రూపాయల ఆస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడులు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారుల్లో జంకుబొంకు లేకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు