బావతో వివాహం.. తర్వాత ఎన్ని మలుపులో..!

1 Mar, 2020 08:26 IST|Sakshi
హోటల్‌ నుంచి యువతిని బలవంతంగా తీసుకెళ్తున్న బంధువులు

సాక్షి, ఒంగోలు: ఓ యువతిని సొంత బంధువులే కిడ్నాప్‌ చేసేందుకు విఫలయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుల కార్లను ఛేజ్‌ చేసి ఆమెను రక్షించి నగరంలోని ఓ హోమ్‌కు తరలించారు. వివరాలు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతి వైజాగ్‌లో బీఎల్‌ చదివే క్రమంలో తల్లిదండ్రులు ఆమెకు ఆమె బావతో వివాహం చేశారు. ఆమెకు ఆ వివాహం ఇష్టం లేకపోవడంతో ఎనిమిది నెలల్లోనే మూడుసార్లు ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. మూడోసారి ఈ ఏడాది జనవరి 29న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగి కనీసం వారికి టచ్‌లోకి కూడా రాకపోవడంతో తల్లి బెంగ పెట్టుకుంది. ఎలాగైనా తన కుమార్తె ఆచూకీ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తల్లి ఆమె స్నేహితులను కలిసింది.  చదవండి: నటి 'శ్రుతి' లీలలు మామూలుగా లేవుగా..!

వైజాగ్‌కు చెందిన తరుణ్‌ తన కుమార్తెకు స్నేహితుడని తెలుసుకుని అతడితో తల్లి మాట్లాడింది. తాను ప్రస్తుతం బెంగళూరులో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్నానని, తనకు మీ కుమార్తె విషయం తెలియదని తెలిపాడు. తల్లి మరింతగా ప్రాధేయపడటంతో ఓకే అన్న తరుణ్‌..తనతో పాటు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తున్న రాఘవ, అతని స్నేహితుడు మనోజ్‌ల సాయం తీసుకున్నాడు. ఆమె ఎక్కడ ఉందనే విషయమై ఫేస్‌బుక్‌లో ముగ్గురు కలిసి సెర్చ్‌ చేశారు. చివరకు ఆమె ముంబైలోని ఓ కాల్‌ సెంటర్‌లో పనిచేస్తోందని తెలుసుకున్నారు.
 
ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న సీఐ 
డబ్బుకు ఆశ పడిన యువకులు 
తన కుమార్తెను అప్పగిస్తే ఎన్ని డబ్బులైనా ఇస్తానని తల్లి చెప్పడంతో ఆ ముగ్గురు యువకులు ఒక ప్లాన్‌ వేశారు. తమ స్నేహితురాలు ఒకరు ముంబైలో ఉద్యోగం చేయాలనుకుంటోందని, మదనపల్లె వస్తే ఆమెను కూడా తీసుకెళ్దువంటూ యువతిని కోరారు. ఈ మేరకు ఆమె గోవా వరకు బస్సులో రాగా యువకులు ముగ్గురు కారులో వెళ్లి ఆమెను తొలుత మదనపల్లె తీసుకొచ్చారు. తమ కుమార్తెను ఎలాగైనా ఒంగోలు తీసుకురావాలని ఆమె తల్లి ఆ ముగ్గురు యువకులను కోరింది. వారు నచ్చ జెప్పడంతో యువతి నమ్మి వారితో పాటు ఒంగోలు వచ్చి ఓ హోటల్లో బస చేసింది. ఈ క్రమంలో యువకులు ముగ్గురు ఆమె తల్లికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు.  చదవండి:  అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? 

దౌర్జన్యం చేసిన బంధువులు 
సదరు మహిళ బంధువులతో పాటు తల్లి హోటల్‌కు వచ్చి దౌర్జన్యం చేశారు. రూమ్‌ నంబర్‌ 104లో బస చేసిన తమ కుమార్తెను లాక్కెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో యువకులు అడ్డం పడటంతో వారిపై దాడి చేయడంతో పాటు వారు వచ్చిన కారును సైతం ధ్వంసం చేశారు. అనంతరం అడ్డుపడ్డ రాఘవను బలవంతంగా తమతో పాటు కారులో ఎక్కించుకుని చిలకలూరిపేట బయల్దేరారు. హోటల్‌ యజమాని ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ భీమానాయక్‌ తన సిబ్బందితో కలిసి కార్లను వెంబడించి మహిళను రక్షించారు. ఆమెతో పాటు ఉన్న తల్లి, ఇతర బంధువులను అదుపులోకి తీసుకుని ఒన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

యువకులు మాత్రం తాము కేవలం ఆమెను వారికి అప్పగించేందుకైన ఖర్చులు చెల్లించమని కోరామని, తాము సహకరిస్తే ఆమె బంధువులతో చావుదెబ్బలు తిన్నామని వాపోయారు. యువతి తల్లి మాత్రం తమ కుమార్తెను ఆ ముగ్గురు యువకులే తీసుకెళ్లారంటూ ఆరోపిస్తుండగా యువతి మాత్రం తనకు వివాహం ఇష్టం లేక వెళ్లిపోయానని, స్నేహితులుగా ఉంటూ తనను నమ్మించి తనను తల్లిదండ్రులకు బలవంతంగా అప్పగించేందుకు ప్రయత్నించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. యువతి తల్లి, సోదరుడు, భర్త, మరో ఐదుగురు బంధువులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. యువతి తన తల్లిదండ్రులు, భర్తతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను ఒన్‌స్టాప్‌ హోమ్‌కు తరలిస్తున్నట్లు సీఐ భీమానాయక్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు