ఉల్లి దొంగలున్నారు జాగ్రత్త

5 Dec, 2019 07:56 IST|Sakshi

ఉల్లిముందు నగదు, బంగారు బలాదూర్‌ ఉల్లి కిలో రూ.200  

పెరంబలూరు జిల్లాలో 300 కిలో ఉల్లిగడ్డలు చోరీ

25వేల ఎకరాల్లో ఉల్లి ఆదనపుసాగు

సాక్షి ప్రతినిధి, చెన్నై: నగదు, బంగారు, వెండి వస్తువుల స్థానంలో ఉల్లిగడ్డలను బ్యాంకు లాకర్లో పెట్టేరోజులు దాపురించాయి. పెరంబలూరు జిల్లాలో ఓ రైతు 300 కిలోల ఉల్లిగడ్డలను దొంగలెత్తుకుని పోయారు బాబోయ్‌ అంటూ పోలీసుల వద్ద లబోదిబోమన్నాడు.

ఆహారపదార్థాల్లో ఉల్లిలేనిదే అధికశాతం మందికి ముద్దదిగదు. అందునా తమిళనాడులో పెద్ద ఉల్లిగడ్డలతోపాటూ చిన్న ఉల్లిగడ్డల (సాంబార్‌ వెంగాయం) వినియోగం మరీ ఎక్కువ. చిన్ని ఉల్లిగడ్డలతో వండే సాంబార్‌...ఆ రుచే వేరు. ఉల్లిగడ్డలు లేనిదే వంటచేయడం కుదరదనే గృహిణులు కూడా ఉన్నారు. ఇక బిరియానీ వండితే పెరుగు, ఉల్లిగడ్డలతో తయారుచేసే రైతా తప్పనిసరి. ఇలా దైనందిన వంటకాల్లో ఉల్లిగడ్డల ప్రాధాన్యత అంతగా పెరిగిపోవడం వల్లనే దేశమంతా వాటి ధరలపై గగ్గోలు పెడుతోంది. రుతుపవనాల తీవ్రత ఉల్లిగడ్డల పంట దిగుబడి దేశవ్యాప్తంగా దారుణంగా పడిపోయింది. దేశంలోని ఉల్లిగడ్డల అమ్మకాలు మహారాష్ట్రలోని పంటపై దాదాపుగా ఆధారపడి ఉన్నాయి. మహారాష్ట్రలో నైరుతిరుతుపవనాలు ఉల్లిగడ్డల పంటపై తీవ్రంగా ప్రభావం చూపడంతో తమిళనాడుతోపాటూ దేశవ్యాప్తంగా గిరాకీ పెరిగిపోయింది. సహజంగా కిలో రూ.30కి అమ్ముతుండిన పెద్ద ఉల్లిగడ్డల ధర చెన్నై కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే రూ.140–రూ.180 వరకు పలుకుతోంది. అలాగే చిన్న ఉల్లిగడ్డలు కిలో రూ.180–రూ.200 వరకు పెరిగింది. ఇక రిటైల్‌ మార్కెట్‌లో ఉల్లి ధరల ఘాటు చెప్పక్కర్లేదు.  జనవరి తరువాతనే ఉల్లిగడ్డల ధర ఆకాశం నుంచి భూమిమీదకు దిగుతుందని వ్యాపారస్తులు చెబుతున్నారు.

అదనంగా 25 వేల ఎకరాల్లో ఉల్లి సాగుబడి:ఇదిలా ఉండగా, ఉల్లిగడ్డల ధరను అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్రంలో అదనంగా 25 వేల ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల ఎకరాల్లో ఉల్లిగడ్డల సాగు జరుగుతుండగా ఆదనంగా వేయాల్సిన 25వేల ఎకరాల పంట కోసం విత్తనాలు సరఫరా చేసి సాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సూచించింది. జనవరి ఆఖరునాటికి ఉల్లిగడ్డలు విరివిగా అందుబాటులోకి వస్తాయని హార్టికల్చర్‌శాఖ సంచాలకులు సుబ్బయన్‌ తెలిపారు. ఏడాదికి 7 లక్షల టన్నుల ఉల్లిగడ్డల డిమాండ్‌ ఉండగా ప్రస్తుతం 3 టన్నులు మాత్రమే సరఫరా అవుతోందని ఆయన చెప్పారు. ఈ వ్యత్యాసాన్ని అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని వివరించారు.  

ఉల్లిగడ్డల బస్తాలను దొంగలెత్తుకెళ్లారు: పెరంబలూరు జిల్లా ఆలందూరుకు చెందిన ముత్తుకృష్ణన్‌ అనే హోల్‌సేల్‌ వ్యాపారి తన పొలంలో ఉల్లిగడ్డల పంట పండించేందుకు కిలో రూ.120 లెక్కన 300 చిన్న ఉల్లిగడ్డలు కొనుగోలు చేశాడు. వానలు పడుతున్నందున ఉల్లివిత్తనాలు నాటేందుకు ఇదే అనుకూలమైన సమయం అని భావించి తన పొలం సమీపంలో ఉల్లిగడ్డల బస్తాను భద్రం చేసి ప్లాస్టిక్‌ టార్పాలిన్‌ కప్పాడు. మంగళవారం విత్తనాలు నాటేందుకు వెళ్లిచూడగా టార్పాలిన్‌ కింద ఉన్న 300 కిలోల ఉల్లిగడ్డలు కనపడలేదు. చోరీకి గురైన తన ఉల్లిగడ్డలను వెతికిపట్టుకుని తిరిగి ఇప్పించాల్సిందిగా కోరుతూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఉల్లిగడ్డల చోరీ జరిగిందని ఫిర్యాదు చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని పోలీసులు నవ్వులు చిందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు