బెట్టింగ్‌ భూతం

19 Jan, 2019 13:29 IST|Sakshi

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో రూ.29.45 లక్షల సొత్తు స్వాహా

మోసగాడు ఫిజికల్‌ డైరెక్టర్, బాధితుడు బీటెక్‌ విద్యార్థి

తండ్రి మరణంతో వచ్చిన బీమా డబ్బు బెట్టింగ్‌కు వినియోగం

ఇంట్లో బంగారం కూడా మాయం కావడంతో అనుమానం

విద్యార్థి తల్లి ఒత్తిడితో విషయం వెలుగులోకి..

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

ఒంగోలు: బెట్టింగ్‌ పేరుతో ఒక ఫిజికల్‌ డైరెక్టర్‌ వేసిన పన్నాగానికి బీటెక్‌ విద్యార్థి చిక్కాడు.రూ.29.45లక్షల సొమ్ము పోగొట్టుకోవడమే కాకుండా మరో రూ.10లక్షలు చెల్లించాలంటూ వస్తున్న ఒత్తిడితో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ ఘటనపై ఎట్టకేలకు బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు గుట్టురట్టు చేసే దిశగా విచారణ సాగిస్తున్నారు. ఒంగోలు సంతపేటకు చెందిన మోహన్‌కుమార్‌ (పేరు మార్చాం) స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం సీఈసీ చదువుతున్నాడు. ఇతనికి క్రికెట్‌ అంటే పిచ్చి. ఈ పిచ్చితోనే ఇతను క్రికెట్‌ పోటీలకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇతనికి మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వాసి, మేదరమెట్ల సెయింట్‌ ఆర్నాల్డ్స్‌ పాఠశాలలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వేమిరెడ్డి నరేంద్రరెడ్డితో పరిచయం అయింది. క్రికెట్‌ బెట్టింగ్‌ ద్వారా సులువుగా డబ్బులు సంపాదించవచ్చంటూ నమ్మబలికాడు. దీనికి మోహన్‌కుమార్‌ అతడి ట్రాప్‌లో పడిపోయాడు. అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే అందుకు మార్గాలు బోలెడు అంటూ వివరించాడు. ఓటమి బారిన పడుతుందని అందరు అనుకున్న జట్టు గెలుస్తుందని పందెం కాస్తామంటే పది నుంచి 20 రెట్లు పందెం ఆన్‌లైన్‌లో పెడతారన్నాడు. ఇందుకు కనీసంగా పదివేల నుంచి మొదలవుతుందంటూ వివరించాడు. పోతే పదివేలు, వచ్చిందా లక్ష నుంచి రూ.2 లక్షలు. ఇలా పది పందేలు కాద్దాం. అందులో అయిదు పందేలు కట్టినా పోతే రూ.50వేలు, వస్తే రూ.5 లక్షల నుంచి 10లక్షలు అంటూచెప్పడంతో విద్యార్థి  ఓకే అంటూ డబ్బు ముట్టచెప్పడం ప్రారంభించాడు.

ఇంకా రూ.10 లక్షలు చెల్లించాలంటూ తీవ్ర ఒత్తిడి: బీటెక్‌ విద్యార్థి, ఫిర్యాది అయిన  మోహన్‌కుమార్‌కు క్రికెట్‌తోపాటు తన కాలేజీలో తోటి స్నేహితులతో రూ.500 నుంచి రూ.1000 వరకు క్రికెట్‌ బెట్టింగ్‌లు పెట్టేవాడు. ఆ క్రమంలోనే ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అయితే బాగా సంపాదించవచ్చనుకున్నాడు. తండ్రి చలువాడి పుల్లారావు అకాల మరణంతో బీమా సొమ్ము పెద్ద మొత్తంలో వచ్చింది. తల్లి రోల్డ్‌గోల్డ్‌ బిజినెస్‌ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ క్రమంలో బ్యాంకులో ఉన్న డబ్బును కదిలించలేదు. బెట్టింగ్‌ ఆశలో పడిన పవన్‌కుమార్‌ తల్లితో తాను ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తానని, మంచి లాభాలు వస్తాయంటూ నమ్మించాడు. తల్లి నుంచి చెక్కుల మీద సంతకాలు తీసుకొని డబ్బును మార్చుకున్నాడు. ఆ డబ్బును నరేంద్రరెడ్డికి ఇచ్చాడు. ఇలా బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేసి ఇచ్చాడు. కానీ ఒక్క రూపాయి కూడా రాలేదు. అంతే కాకుండా బాగా నష్టపోయావు. నా డబ్బులు పెడతానంటూ ఎదురు పెట్టుబడి పేరుతో నరేంద్రరెడ్డి మరో నాటకం ప్రారంభించాడు. ఇందులో కూడా రూ.20లక్షలు పోయాయని, మొత్తం చెల్లించాలంటూ విద్యార్థిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో చేసేది లేక ఇంట్లో ఉన్న 300 గ్రాముల విలువైన బంగారు బిస్కెట్లను అప్పగించాడు. అయినా ఇంకా మరో రూ.10 లక్షలు చెల్లించాలంటూ నరేంద్రరెడ్డి నుంచి ఒత్తిడి అధికమైంది. ఈ క్రమంలోనే ఇంట్లో బంగారం మాయం కావడంతో తల్లి బిడ్డలను నిలదీసింది. తొలుత తెలియదన్నా చివరకు జరిగిన విషయం చెప్పి బోరుమన్నాడు. దీంతో దిగ్భ్రాంతి చెందడం తల్లి వంతైంది. తల్లి సూచనతో తాను ఎలా మోసపోయింది వివరిస్తూ బాధిత విద్యార్థి టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అసలు బెట్టింగ్‌ ఆనవాళ్లు లేవు..
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు బెట్టింగే లేదని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఎందుకంటే పెద్ద మొత్తంలో బెట్టింగ్‌ల విషయంలో ముందుగానే అకౌంట్లో నగదు ఉండాల్సి ఉంటుంది. సంబంధిత వ్యక్తి వివరాలు కూడా అందులో పొందుపరుస్తారు. కానీ ఇటువంటి అంశాలేమీ లేనట్లు గుర్తించారు.అంతే కాకుండా వేమిరెడ్డి నరేంద్రరెడ్డి, బీటెక్‌ విద్యార్థి మోహన్‌కుమార్‌ నుంచి వస్తున్న మొత్తం నగదును తన తండ్రికి ఇచ్చినట్లుగా గుర్తించారు. దీంతో అతను బాకీలు తీర్చుకున్నట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పెట్టి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కొంత మొత్తమైనా నగదు తిరిగి వస్తుందని, కానీ ఒక్క రూపాయి కూడా రాలేదని చెబుతున్న దృష్ట్యా అసలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ జరగలేదని భావిస్తున్నారు. దీంతో నిందితుడు వేమిరెడ్డి నరేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తే పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని, ఈ మేరకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సీఐ రాంబాబు తెలిపారు. 

మరిన్ని వార్తలు