అత్యాశే ఆసరాగా...

22 Sep, 2018 07:24 IST|Sakshi
పార్శిల్లో వచ్చిన రేకు ముక్కలు, దేముని ఫొటోతో సీడీ, గోళీకాయలు

రిబేటు ధరకు మొబైల్‌ అంటూ మోసం

పది శాతం డబ్బులు పోస్టాఫీసులో  చెల్లిస్తే కొరియర్‌లో ఫోన్‌

అగనంపూడిలోనే  పదిమందికి బురిడీ

పార్శిల్‌లో ఇటుకలు, చెక్క ముక్కలు, దేవుల ఫొటోలు

విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): అమాయకత్వం అనుకోవాలో.. గడుసుతనం అనుకోవాలో తెలీదు. నిత్యం ఎక్కడో ఒక చోట మాయ మాటలతో మోసాలు చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నా, యువత, మహిళల్లో చైతన్యం రావడం లేదు. ఫోన్‌ ద్వారానో, మెసేజ్‌లు, మెయిల్‌ మెసేజ్‌లు ద్వారానో మీకు లక్కీ డిప్‌ పలికిందనో, డ్రా పలికింది.. మీ బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు జమ కానున్నాయనో రకరకాలుగా  మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతున్నా, నేటికీ అవివేకంగా మోసపోతూనే ఉన్నారు. అత్యాశకు పోయి వేలకు వేలు డబ్బులు మూల్యంగా చెల్లించుకోవల్సి వస్తుంది.  తాజాగా అగనంపూడికి చెందిన పది మంది ఇదే తరహా మోసానికి గురై లబోదిబో అంటున్నారు.

మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఫోన్‌ బిజినెస్‌లో భాగంగా ఫోన్‌ నంబర్లు డ్రా తీయగా మీ నంబర్‌ డ్రాలో పలికిందని, రూ.15 వేల విలువైన సెల్‌ఫోన్‌కు కేవలం పదిశాతం అంటే రూ.15 వందలు చెల్లిస్తే మీ స్వంతమని ఫోన్‌లో స్వీట్‌ వాయిస్‌ వినపడుతుండడంతో నిజమేనని నమ్మి పోస్టాఫీసు ద్వారా పదిమంది డబ్బులు చెల్లించారు. డబ్బులు చెల్లిం చిన ఐదు రోజుల్లో చెల్లింపుదారుల పేరుతో పార్శిల్‌ ఇంటికి వస్తుంది. ప్యాకెట్‌ను తెరిచి చూస్తే ఫోన్‌ స్థానంలో  ఇటుకలు, చెక్కముక్కలు, నిరోధ్‌ ప్యాకెట్లు, దేవుని ఫొటోలతో ఉన్న సీడీలు, ఇత్తడి రేకులు, గో ళీలు ఇలా రకరకాల వస్తువులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అవాక్కవ్వడం తప్ప చేసేది లేక లోలోనే మధనపడుతున్నారు. వెంటనే సదరు నంబర్‌కు ఫోన్‌ చేస్తే ఏముంది ఫోన్‌ స్విచ్‌ ఆ‹ఫ్‌ చేసి ఉందనో, అందుబాటులో  లేదనో, మనుగడలో లేదనో సమాధానం వస్తుండడంతో  మోసాన్ని గ్రహిస్తున్నారు. అత్యాశకు పోవడం వల్ల రూ.15 వందలు పోయాయని మింగలేక కక్కలేక లబోదిబోమంటున్నారు. 

మరిన్ని వార్తలు