ఆన్‌లైన్‌ మోసాలకు కళ్లెం

3 Mar, 2018 10:59 IST|Sakshi

ఇక నెట్‌ ఆగడాలకు తెరపడినట్లే

ఈ కామర్స్‌పై తూనికలు, కొలతల శాఖ దృష్టి

వినియోగదారులు ఫిర్యాదు చేసే అవకాశం

నగరానికి చెందిన రాజేష్‌కు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే అలవాటు ఉంది. ఖరీదైన మొబైల్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చినకవర్‌ను తెరిచి చూసి షాక్‌ అయ్యాడు. తాను బుక్‌ చేసినది కాకుండా మరొకటి రావడంతో ఖంగుతిన్నాడు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ఆందోళన చెందాడు. ఆన్‌లైన్‌లో చూస్తే ఎలాంటి వివరాలు లేవు.
పీలేరుకు చెందిన రాణి ఆన్‌లైన్‌లో ఓ ఖరీదైన చీరను కొనుగోలు చేసింది. పార్సిల్‌లో నాసిరకం చీర వచ్చింది. దీన్ని చూసిన ఆమె ఎవరికి చెప్పుకోలేక మథనపడుతోంది.

తిరుపతి క్రైం :జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాం తంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నగదు రహి త లావాదేవీలు పెరగడంతో ప్రతి ఒక్క రూ ఆన్‌లైన్‌ వ్యాపారంపై మొగ్గు చూపుతున్నారు. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇలాంటి మోసాలకు కళ్లెం వేసేందుకు తూనికలు, కొలతలు శాఖ అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ– కామర్స్‌ వైపు దృష్టి పెట్టేలా ప్రభుత్వం జీవో నెం.629ను విడుదల చేసింది. దాంతో ఆన్‌లైన్‌లో జరిగే మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం ఈ బాధ్యతల ను తూనికలు, కొలతలశాఖకు అప్పగించింది. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలను అమలుకు ఆ శాఖ అధికారులు ఉపక్రమిస్తున్నారు.

ఈ మార్కెట్‌పై నిఘా
వినియోగదారుల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తున్న నేపథ్యంలో ఈ– మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు కేంద్రం కొన్ని చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఈ పర్యవేక్షణ బాధ్యతలను తూనికల కొలతల శాఖకు అప్పగించింది. జీఎస్‌ఆర్‌ 629 ఉత్తర్వు ల మేరకు ఈ తరహా మోసాలకు అడ్డుకట్టు వేసేందుకు చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో వస్తువులను విక్రయించే సంస్థలు ఇప్పటి వరకు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) మాత్రమే ముద్రిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి తయారీ తేదీ, వినియోగదారుడికి అందజేసే గడువు, బరువు, పరిమాణం తదితర వివరాలతోపాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వినియోగదారులు సంద్రించాల్సిన చిరునామా, కస్టమర్‌ కేర్‌ ఫోన్‌ నెంబర్‌ను స్పష్టంగా ముద్రించాలని, సంబంధిత ఉత్పత్తుల పూర్తి సమాచారం, కొనుగోలుదారులు సులభంగా చదువుకునేలా పెద్ద అక్షరాలతో ముద్రించాలని వినియోగదారుల వ్యవహారాలశాఖ పేర్కొనడంతో ఈ దశగా మార్పులు ప్రారంభమయ్యాయి.

ఇది పరిస్థితి
జిల్లాలో 70 నుంచి 80 శాతం మంది సెల్‌ఫోన్లను వినియోగిస్తున్నా రు. వీరిలో 40 శాతం మందికి పైగా 4జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. తద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారు. ఫ్యాషన్‌కు అనుగుణంగా చొక్కాలు మొదలుకుని సెల్‌ఫోన్లు, కొత్తకొత్త మోడళ్ల కోసం నిత్యం సర్చ్‌ చేస్తున్నారు. దీంతో పుట్టగొడుగుల్లా కొత్త వ్యాపార సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎలాంటి సెక్యూరిటీ లేని వాట్సాప్, ఫేస్‌బుక్, గూగుల్‌ వంటి మాధ్యమాల్లో ప్రచారాలు చేస్తున్నాయి. వాటి జోలికి వస్తే నట్టేట ముంచేస్తున్నారు.

ఫిర్యాదు ఇలా
ఎవరైనా ఆన్‌లైన్‌ మోసాలకు గురైతే వెంటనే తూనికలు, కొలతల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. డివిజన్ల వారీగా ఇన్‌స్పెక్టర్లకు లేదా సంబంధిత అధికారులను కలిసి తాము మోసపోయిన విధానాన్ని వివరించవచ్చు. ఫిర్యాదులతో పాటు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన రసీదు, సెల్‌ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లు చూపించాల్సి ఉంటుంది. కొనుగోలు సమయంలో ఆన్‌లైన్‌లో చూపించిన వస్తువు, ఇంటికొచ్చిన పార్సల్‌లోని వస్తువును చూపించాలి. అలా వివరించిన అనంతరం మోసానికి పాల్పడిన సంస్థకు తూనికల శాఖ నోటీసు జారీ చేస్తుంది. అనంతరం వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు.

మోసానికి పాల్పడితే చర్యలే..
ఈ–కామర్స్‌ సంస్థలో వినియోగదారులు మోసపోకుండా భద్రత కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వీటిలో జరిగే లావాదేవీలపై తూనికలశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఆన్‌లైన్‌ కంపెనీలు ఎటువంటి మోసాలకు పాల్పడినా వెంటనే ఫిర్యాదు చేయండి. వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో వస్తువులు మారినా, నాణ్యత తగ్గినా వస్తువు వివరాలు లేకపోయినా చర్యలు తప్పవు.– రవీంద్రారెడ్డి, తూనికలు,కొలతలశాఖాధికారి, తిరుపతి

మరిన్ని వార్తలు