మాయా ఉంది..మోసం ఉంది!

1 Jun, 2018 11:15 IST|Sakshi
పార్శిల్‌లో వచ్చిన వస్తువులు

ఫోన్‌కు బదులు బెల్టు

వెలుగు చూస్తున్న మోసాలు

లబోదిబోమంటున్న బాధితులు

కొమరోలు (గిద్దలూరు): ఖరీదైన మొబైల్‌ పంపిస్తామంటూ బెల్టు, ఏటీఎం కార్డు ఉంచుకునే పౌచ్‌ పంపడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఈ మోసం మండలంలోని బాదినేనిపల్లెలో గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన రోశయ్యకు ఇటీవల ఓ ఫోన్‌ వచ్చింది. నీ సెల్‌ఫోన్‌కు రూ.కోటి లాటరీ తగిలిందని, ఖరీదైన మొబైల్‌ వచ్చిందని నమ్మించారు. వారం క్రితం అడ్రసు చెబితే పోస్టాఫీసుకు సెల్‌ పంపిస్తామని చెప్పారు. శేషయ్య తొలుత అడ్రసు చెప్పేసి వదిలేశాడు. రెండు రోజుల క్రితం తిరిగి ఫోన్‌ చేసి పార్సిల్‌ పంపించామని, పోస్టాఫీసులో ఉందని చెప్పారు. నగదు చెల్లించి పార్శిల్‌ తీసుకునేందుకు ఆయన ఇష్ట పడలేదు.

రెండు రోజులుగా ఫోన్‌ చేసి పార్శిల్‌ తీసుకుంటే మంచి మొబైల్‌ వస్తుంది, ఎందుకు తీసుకోవడం లేదని సదరు ఫోన్‌ చేస్తున్న వ్యక్తి విసిగించడం ప్రారంభించాడు. అతని మాయ మాటలు నమ్మిన బాధితుడు చివరకు పోస్టాఫీసుకు వెళ్లి రూ.4,150లు చెల్లించి పార్శిల్‌ తీసుకున్నాడు. పార్శిల్‌ ఓపెన్‌ చేయగా అందులో బెల్టు, ఏటీఎం కార్డులు దాచుకునే పౌచ్‌ మాత్రమే ఉంది. మోసపోయానని తెలుసుకున్న ఆయన తిరిగి మొబైల్‌కు వచ్చిన నంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాప్‌ వచ్చింది. పది రోజుల క్రితం ఇదే మండలం పోసుపల్లెకు చెందిన ఓ వ్యక్తి ఇలాగే మోసపోయి రూ.4,150లు చెల్లించాడు. కవర్‌లో బూడిద వచ్చింది. కొమరోలు మండల కేంద్రంలోని ఇస్లాంపేటకు చెందిన ఓ వ్యక్తికి కవర్‌లో లక్ష్మీదేవి ఫొటో వచ్చింది. ఇలా ప్రజలను మోసం చేసేందుకు మాయగాళ్లు నిత్యం ఫోన్‌ చేస్తూ ఆశపెట్టి ముంచుతుంటారని బాధితుడు వాపోయాడు.

మరిన్ని వార్తలు