ఆన్‌లైన్‌ మోసం

28 Jan, 2019 07:22 IST|Sakshi
సెల్‌ బదులు పార్సిల్‌లో వచ్చిన బెల్టు, పర్సు చూపుతున్న బాధితుడు

పశ్చిమగోదావరి, గోపాలపురం: ఆన్‌లైన్‌ మోసానికి మరో యువకుడు బలయ్యాడు. ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్‌ బుక్‌చేస్తే బెల్టు, ఏటీఎం కార్డులు పెట్టుకునే పర్సు పంపడంతో లబోదిబోమంటున్నాడు. గోపాలపురం మండలం నందిగూడెం గ్రామానికి చెందిన చిన్న వెంకటేశ్‌ అనే యువకుడికి ఎస్‌ఎస్‌ టెలీ డీల్‌ కంపెనీ నుంచి ఫోన్‌ వచ్చింది. మీ ఫోన్‌ నంబర్‌కు ఆఫర్‌ తగిలిందని రూ.12 వేల విలువైన సెల్‌ఫోన్‌ రూ.4,050 చెల్లిస్తే సొంతమవుతుందని నమ్మబలికారు.

దీనిని నమ్మిన వెంకటేశ్‌ ఆర్డర్‌ చేయగా గ్రామంలోని పోస్టాఫీసుకు పార్సిల్‌ వచ్చింది. సెల్‌ఫోన్‌ తీసుకున్న తర్వాత పోస్టాఫీసులో నగదు చెల్లించాలనడంతో వెంకటేశ్‌ పార్సిల్‌ తీసుకుని రూ.4,050 చెల్లించాడు. పార్సిల్‌ తెరిచి చూడగా బెల్టు, ఏటీఎం కార్డులు పెట్టుకునే పర్సు ఉన్నాయి. వెంటనే వెంకటేశ్‌ తనకు ఫోన్‌ వచ్చిన నంబర్‌కు కాల్‌చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. ఇటీవల ఆన్‌లైన్‌ మోసాలు పెరిగాయని, మహిళలతో ఫోన్‌కాల్స్‌ చేయించి అమాయకులను బుట్టలో వేసుకుంటున్నారని, అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌స్టేషన్‌ హౌస్‌ అధికారి జి.శ్రీనివాసరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు