నమ్మేశారో.. దోచేస్తారు! 

10 Dec, 2019 08:16 IST|Sakshi
పోస్టల్‌ ద్వారా వచ్చిన స్క్రాచ్‌ కార్డ్‌

లక్కీడ్రాలో గెలుపొందారంటూ ప్రలోభాలు

ఆశపడిన వారి నుంచి డబ్బులు గుంజేస్తున్న వైనం

‘షాప్‌ క్లూస్‌’ పేరుతో కవర్లు పంపిస్తున్న వైనం 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆన్‌లైన్‌ మోసగాళ్లు మళ్లీ జూలు విదిల్చారు. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న కేటుగాళ్లు ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టళ్ల పేరున సరికొత్తగా మోసాలకు తెర తీస్తున్నారు. ఏ మాత్రం ఆశపడినా  ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ తరహా మోసాలు రెండు రోజులుగా వెలుగుచూస్తున్నాయి. సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌ సెల్‌లోనూ శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి తాను రూ.63వేలు నష్టపోయానంటూ ఫిర్యాదు చేశారు.

కవర్లతో వల.. 
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్న వారి పేరున మోసగాళ్లు ముందుగా ఓ కవర్‌ పంపిస్తున్నారు. అందులో పేరు, అడ్రస్‌ కూడా సరిగ్గా ఉంటున్నా యి. ఈ కవర్‌లో ఓ కూపన్‌ పెడుతూ అందులో ఓ కోడ్‌ను ఉంచుతున్నారు. స్క్రాచ్‌ చేసి చూస్తే కొన్ని లక్షలు బహుమతి గెలుచుకున్నట్లు వ స్తుండడంతో అమాయకులు వారి వలలో పడిపోతున్నారు. బహుమతి వచ్చిందన్న తొందరలో కొందరు కవర్‌లో పేర్కొన్న నంబర్లకు ఫోన్‌ చేయడం, అకౌంట్‌ నంబర్లతో పాటు ఓటీపీలు కూడా చెప్పేస్తుండడంతో దుండగులు చాలా సులభంగా డబ్బులు దోచేస్తున్నారు. మెసేజీలు, ఫోన్‌కాల్స్‌ రూపంలో కూడా ఈ మోసాలు జరుగుతున్నాయి.

అడ్రస్‌ ఎలా సంపాదిస్తున్నారు..? 
ఇన్నాళ్లూ మెసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌ల రూపంలో ఈ తరహా మోసాలు అధికంగా జరిగేవి. కానీ ఇప్పుడు కేటుగాళ్లు మరో అడుగు ముందుకు వేసి అడ్రస్‌లు కూడా కనుగొని ఏకంగా కవర్లే పంపిస్తున్నారు. అంత కచ్చితంగా అడ్రస్‌లు వారికి ఎలా తెలుస్తున్నాయో అంతుపట్టడం లేదు. సోషల్‌ మీడియా వచ్చాక ఎవరి వివరాలకూ భద్రత ఉండడం లేదన్నది సత్యం. అందులోనుంచే వీరు అడ్రస్‌లు సంపాదిస్తూ ఇలా సరికొత్త దోపిడీకి తెర తీస్తున్నారు.

 అప్రమత్తంగా ఉండాల్సిందే.. 
ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక యాప్‌ల వినియోగానికి అంతా సొంత వివరాలను అప్పగించేస్తున్నారు. అనుమతి అడిగిన ప్రతి సారీ ‘అలోవ్‌’ ఆప్షన్‌ను ఇష్టానుసారం క్లిక్‌ చేసి పడేస్తున్నారు. ఈ ఆతృతే అక్రమాలకు మూలమవుతోంది. పలు సైట్లకు, యాప్‌లకు వినియోగదారులు ఇస్తున్న సొంత వివరాలను ఆధారంగా చేసుకుని దొంగలు గురిచూసి కొడుతున్నారు.

మొదటిసారి కాదు.. 
జిల్లాలో ఈ తరహా మోసాలు జరగడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు లక్కీడ్రా ల్లో మోటారు బైక్‌లు ఇస్తామంటే చాలా మంది నమ్మేశారు. తక్కువ ధరకు వాహనాలు ఇస్తామంటే వారినీ విశ్వసించి మోసపోయారు. మె సేజీలకు, ఫోన్‌కాల్స్‌కు కూడా వారి వలలో పడిపోయారు. దీనిపై పోలీసులు ఎంతగా అ వగాహన కల్పిస్తున్నా అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌ మోసాలపై జా గ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఖాతా నంబర్, ఓ టీపీలు ఎవరికీ చెప్పకూడదని ఎస్పీ అమ్మిరెడ్డి ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌లో సూచించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు