సివిల్‌ కేసులో ఒంటిమిట్ట సీఐ జోక్యం!

19 May, 2018 10:58 IST|Sakshi
నందలూరులో గొబ్బిళ్ల స్కూలు గేటు వద్ద సీఐ, పోలీసులు

అధికారపార్టీ ఒత్తిడి ప్రభావం

గేటు తెరవాలని హకుం

రాత్రిపూట విచారణ ఏమిటీ..?

ఆత్మహత్యకు సిద్ధమంటూ బాధితుల నినాదాలు  

వైస్సార్, రాజంపేట: నందలూరు మండల పరిధిలోని గొల్లపల్లె రహదారిలో ఉన్న గొబ్బిళ్ల మెమోరియల్‌ హైస్కూల్‌ ఆస్తి వ్యవహారంలో ఒంటిమిట్ట సీఐ రవికుమార్‌ వ్యవహరించిన తీరుపై స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలు గొబ్బిళ్ల భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ గొబ్బిళ్ల హైస్కూ ల్‌ ఆస్తి నా పేరుతో రిజిష్టరు అయిందన్నారు. అయితే దానిని కబ్జా చేయడానికి కోడూరు సుజాత కుట్ర పన్ని పోలీసులకు తప్పుడు సమచారం ఇచ్చిందన్నారు. దానికి అధికారపార్టీ నాయకుల వత్తిడి మేరకు ఒంటిమిట్ట సీఐ రవికుమార్‌ జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. రాత్రి పది గంటల సమయంలో సీఐ తన సిబ్బందితో ఆవరణంలోకి ప్రవేశించి, గేటు ఓపెన్‌ చేయాలని విచారణ నిమిత్తం వచ్చానని చెప్పినట్లు తెలిపారు.

దౌర్జన్యంగా తమ పట్ల సీఐ వ్యవహరించారన్నారు. అర్ధాంతరంగా రాత్రి సమయంలో సీఐ సివిల్‌ వ్యవహారంలో తలదూర్చి విచారణ చేయడం తగదన్నారు. ఈనెల 2వతేదీ కోడూరు సుజాత, ఇద్దరి పిల్లలపై నందలూరు పోలీసుస్టేషన్‌ తాను ఫిర్యాదు చేయగా, నాన్‌బెయిల్‌బుల్‌ కింద కేసు నమోదైందని పేర్కొన్నారు. అయితే ఇంతవరకు ఆ కేసుపై ఎటువంటి విచారణ కానీ, అరెస్టు కానీ చేయలేదని ఆరోపించారు. కేసులో ఉన్న వారు పోలీసుస్టేషన్‌లో సీఐ ఎదుట కూర్చొని మాట్లాడుతున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యం తమ పట్ల ఇలాగే కొనసాగితే తనతోపాటు నా కుటుంబసభ్యులు అందరం కలిసి పోలీసుస్టేషన్‌ ఎదుట ఆత్మహత్య చేసుకుంటామన్నారు. పోలీసులు అక్రమంగా తమ ఆస్తిలోపలికి ప్రవేశిస్తే తమకు ఆత్మహత్య శరణ్యమని వాపోయారు. తప్పుడు సమాచారం జిల్లా ఎస్పీకి చేరవేస్తున్నారని ఆరోపించారు.

తాను జోక్యం చేసుకోలేదు
ఈ విషయంపై సీఐ వివరణ కోరగా తాను సివిల్‌ కేసులో జోక్యం చేసుకోలేదని తెలిపారు. అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు