ఓయూ ప్రొఫెసర్‌ కాశిం అరెస్టు

19 Jan, 2020 04:58 IST|Sakshi

మావోయిస్టులకు సహకరిస్తున్నారని అభియోగం

ఓయూ క్యాంపస్‌లో అరెస్టు

ములుగు పోలీస్‌ స్టేషన్‌కు తరలింపు

అరెస్టు వివరాలు వెల్లడించిన సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌

సాక్షి, సిద్దిపేట: ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధ ఆర్ట్స్‌ కాలేజీ తెలుగు డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ కాశింను శనివారం ఉదయం హైదరాబాద్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌ క్వార్టర్స్‌లో అరెస్టు చేసినట్లు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర ప్రొఫెషనల్‌ రెవల్యూషనరీ డాక్టర్‌ చింతకింది కాశిం అలియాస్‌ కార్తీక్‌కు కొన్ని సంవత్సరాలుగా మావోయిస్టు స్టేట్‌ కమిటీ, సెంట్రల్‌ కమిటీ నేతలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై 2016లో సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయినట్లు వివరించారు. ఈ కేసు పరిశోధనలో భాగంగా గజ్వేల్‌ కోర్టు నుంచి సెర్చ్‌ వారంట్‌ తీసుకున్నారు.

గజ్వేల్‌ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో స్పెషల్‌ టీం శనివారం ఉదయం 7 గంటల నుంచి 10–05 గంటల వరకు కాశీం నివాసం ఉంటున్న ఉస్మానియా క్యాంపస్‌ హైదరాబాద్‌ క్వార్టర్‌ ఆరో బ్లాక్, 9వ ప్లాట్‌లో అతని భార్య, బంధువుల సమక్షంలో సెర్చ్‌ చేశారని జోయల్‌ డేవిస్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన సీపీఐ (మావోయిస్టు) పార్టీల విప్లవ సాహిత్యం, కరపత్రాలు, సీడీలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకొని, సీజ్‌ చేసి, అరెస్టు చేస్తున్నట్లు అతని భార్యకు తెలిపినట్లు సీపీ పేర్కొన్నారు.

అదే విధంగా సీపీఐ (మావోయిస్టు) తెలంగాణ కమిటీ సెక్రటరీ హరిభూషణ్‌ అలియాస్‌ జగన్, ఇతర నేతలతో, మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యులతో సంబంధాలు కొనసాగిస్తూ, వారు ఇచ్చే డబ్బులతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఆరు కేసుల్లో కాశిం నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. కాశింను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.

కాశిం అరెస్టు అన్యాయం
సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ కాశిం అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న ఓ ప్రొఫెసర్‌ను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసిందని, అగ్రకుల అహంకారంతో ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అతనిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని, బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు