ఆయువుతో ఆట

21 Jul, 2020 07:43 IST|Sakshi

గ్రేటర్‌లో ఆక్సిజన్‌ సిలిండర్ల అక్రమాల మేట  

రెండు మూడు రెట్లు ధరలు పెంచి విక్రయం

అసలు ధరలు రూ.10వేలు.. ఇచ్చే ధర రూ.25 వేలు

ప్రజల ఆపదను ఆసరాగా చేసుకుని వ్యాపారం  

కరోనా వేళ యథేచ్ఛగా సాగుతున్న కాసుల వేట

ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ యువకుడి తాతకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కానీ వ్యాధి లక్షణాలు పెద్దగా లేవు. దీంతో వైద్యులు ఇంట్లోనే ఉండాలని వృద్ధుడికి సూచించారు. ఎక్కువ వయసు కావడంతో ఆక్సిజన్‌ పెట్టాలన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్‌ కొనేందుకు వివిధ కంపెనీలకు ఫోన్‌ చేశారు సదరు యువకుడు. ప్రస్తుతం స్టాక్‌ లేదని, రెండు మూడు రోజుల్లో వస్తుందని ఓ కంపెనీ చెప్పింది. ఆ తర్వాత మాట మార్చింది. ఆర్డర్లు చాలా ఉన్నాయి. ధరలు బాగా పెరిగాయి. అత్యవసరమైతే తాము చెప్పిన ధర చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో 13 కేజీల సిలిండర్‌ రూ.25 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. సాధారణ రోజుల్లో ఈ సిలిండర్‌ రూ.10 వేలకే లభిస్తుంది. కానీ.. కరోనా వేళ కాసుల దందా చేస్తున్న కొన్ని కంపెనీలు దోపిడీ చేస్తున్నాయి. నగరంలో సిలిండర్ల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందనడానికి  ఈ ఉదాహరణ ఓ మచ్చుతునక. సిలిండర్‌ ధర కంటే ఎక్కువగా తీసుకొని విక్రయిస్తుండటం షరామామూలుగా మారింది. కొంత మంది వ్యాపారులు వందల సంఖ్యలో సిలిండర్లు ఉన్నా స్టాక్‌ లేదనే సాకుతో ఎక్కువ డబ్బులు గుంజుతున్నారు.

సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్‌లో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ముందస్తుగా వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ఇటు ఆక్సిజన్‌ సిలిండర్‌ కంపెనీలు అటు అక్రమ వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచి విక్రయిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. నగరంలో ఎక్కువగా మెడికల్‌ దుకాణాలు కేంద్రంగా సిలిండర్ల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎల్‌బీనర్, మలక్‌పేట్, నాంపల్లి, కోఠి, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు పాతబస్తీలోని పలు మెడికల్‌ పాపుల నిర్వాహకులు లైసెన్స్‌ ఉన్న కంపెనీల నుంచి అక్రమంగా సిలిండర్లు కొనుగోలు చేసుకున్నారు. వీటిని నిల్వ చేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ‘సాక్షి’ సర్వేలో వెలుగు చూసింది. సిలిండర్‌ కావాలని అడిగితే ముందు లేదని చెబుతున్నారు. ఆ తర్వాత పరిచయం ఉన్న వ్యక్తి పేరు చెబితే మాత్రం సిలిండర్‌ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. తాము చెప్పిన ధర ఇవ్వాలని లేని పక్షంలో సిలిండర్‌ లేదని తెగేసి చెబుతున్నారు. కరోనా వేళ కేటుగాళ్లు క్యాష్‌ చేసుకోవడంతో చేతివాటం కనబరుస్తున్నారు.  

అవసరాన్ని బట్టి..  
గ్రేటర్‌లో కరోనా వ్యాధి విశ్వరూపం దాలుస్తుండటంతో వ్యాధి బారినపడిన వారికి ఆసుపత్రుల్లో వైద్యం సరిగా అందలేదు. దీంతో రోగులు ఇళ్ల వద్దే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. రోగం ముదరక ముందు అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుకుంటున్నారు. రోగుల సంబంధీకులు ఇందులో భాగంగా ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. కొందరు డాక్టర్ల సూచనల మేరకు రోగులకు ఆక్సిజన్‌ పెడుతున్నారు. అయితే కరోనా వ్యాధి తీవ్రతతో జనం ఆక్సిజన్‌ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలో జోరుగా అక్రమంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ దందా సాగుతోంది. సిలిండర్‌ అసలు ధర కంటే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఎంత అత్యవసరమైతే అంత ఎక్కువ ధర తీసుకుంటున్నారు. 

లైసెన్స్‌ లేకపోయినా ఫిల్లింగ్‌..  
లైసెన్స్‌ లేకపోయినా సిలిండర్లు ఫిల్లింగ్‌ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు జంబో, పెద్ద సిలిండర్లు కంపెనీల నుంచి తీసుకొచ్చి ఇళ్లలో, షాప్‌ల్లో రీఫిల్లింగ్‌ చేస్తున్నారు. జంబో, పెద్ద సిలిండర్ల ద్వారా పైప్‌లైన్స్‌ ఏర్పాటు చేసి ఎల్‌పీజీ సిలిండర్‌ ఫిల్లింగ్‌ చేసినట్లు ఆక్సిజన్‌ సిలిండర్లు ఫిల్‌ చేస్తున్నారు. 10 కేజీల సిలిండర్‌ రూ.500 నుంచి రూ.800 వరకు, 13 కేజీల సిలిండర్‌ రూ. 1000 నుంచి రూ.1200కు ఫిల్లింగ్‌ చేస్తున్నారు. కొంతమంది పూర్తిగా సిలిండర్‌ ఫిల్లింగ్‌ చేయడం లేదు. ఎందుకంటే  కొనుగోలు చేసినప్పుడు వచ్చినంత బరువు ఉండడం లేదు. అదేవిధంగా కొత్తగా కొన్న సిలిండర్‌ మూడు నుంచి నాలుగు రోజులు వస్తే ఫిలింగ్‌ చేసిన సిలిండర్‌ రెండు రోజులకే అయిపోతోంది. ఫిల్లింగ్‌కు ఒకవైపు ఎక్కువ డబ్బులు మరోవైపు తక్కువగా ఫిలింగ్‌ చేస్తూ ఆపదలో ఉన్నవారిని మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. 

లెసెన్స్‌ ఉంటేనే విక్రయించాలి..
గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఆక్సిజన్‌ సిలిండర్ల ప్లాంట్స్‌ ఉన్నాయి. ఇవి డ్రగ్స్‌ కంట్రోల్‌ అనుమతి తీసుకోవాలి. ఈ కంపెనీలు మాత్రమే ఆక్సిజన్‌ ఫిల్లింగ్‌తో పాటు నాణ్యమైన సిలిండర్లు తయారు చేసి విక్రయిస్తాయి. అక్రమ వ్యాపారులు కంపెనీల నుంచే సిలిండర్లు కొనుగోలు చేసి తమ వద్ద నిల్వ చేసుకొని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. సిలిండర్ల రీఫిల్లింగ్‌ కంపెనీల్లోనే చేయాలి. కానీ అన్ని ప్రాంతాల్లో కంపెనీ రీఫిల్లింగ్‌ అందుబాటులో లేకపోవడంతో పలువురు జంబో, పెద్ద సిలిండర్ల ద్వారా ఇళ్లలో, షాప్‌ల్లో రీఫిల్లింగ్‌ యూనిట్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలిసినా డ్రాగ్స్‌ కంట్రోల్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు