ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్ల తయారీ గుట్టురట్టు

11 Aug, 2018 12:54 IST|Sakshi
అధికారులు స్వాధీనం చేసుకున్న ఆక్సిటోసిన్‌ మందు ఆక్సిటోసిన్‌ మందును పరిశీలిస్తున్న డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అబిద్‌ అలీ

కర్నూలు(హాస్పిటల్‌): నిషేధిత ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్ల తయారీని ఔషధ నియంత్రణ శాఖ అధికారులు గుట్టు రట్టు చేశారు. పశువులు పొదుగు నుంచి పాలు విడవటానికి వాడే ఈ ఇంజెక్షన్లను కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే నిషేధించింది. అయితే కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి సొంతంగా ఇంట్లోనే బ్రాండ్‌ పేరు ఏమీ లేకుండా ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు తయారు చేస్తూ దర్జాగా వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు వలపన్ని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. 

అప్పుల నుంచి గట్టెక్కేందుకు అక్రమ మార్గం..
వెల్దుర్తి మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన ఎన్‌.ప్రసాద్‌ 20 ఏళ్ల క్రితమే కర్నూలు నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. కొన్నాళ్ల పాటు నంద్యాల రోడ్డులో దాణా వ్యాపారం చేసి జీవనం సాగించాడు. ఈ క్రమంలో అతనికి రియల్టర్‌ వీసీ రమణ పరిచయమయ్యాడు. అతని మాటలు నమ్మి సంపాదించిన సొమ్మంతా పోగొట్టుకున్నాడు. వీసీ రమణ ఐపీ పెట్టడంతో ప్రసాద్‌ అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు కొన్నేళ్ల క్రితమే ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్ల తయారీ ప్రారంభించాడు. లాలూ అనే వ్యక్తి నుంచి ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ అనే కెమికల్, స్థానికంగా ఆక్టిక్‌ యాసిడ్‌ను కొనుగోలు చేసి ఇంజెక్షన్లు తయారు చేయసాగాడు. రెండు లీటర్ల ఆక్సిటోసిన్, నాలుగు లీటర్ల ఆక్టిక్‌ యాసిడ్, 14 లీటర్ల నీళ్లు కలిపి మొత్తం 20 లీటర్ల ఆక్సిటోసిన్‌ మందును తయారు చేసి వాటిని బాటిళ్లలో నింపాడు. 100 ఎంఎల్‌ బాటిల్‌ అయితే రూ.60లు, 200 ఎంఎల్‌ బాటిల్‌ అయితే రూ.100లకు రైతులకు, పాలవ్యాపారులకు విక్రయించడం మొదలుపెట్టాడు. 

వలపన్ని పట్టుకున్న అధికారులు
నిషేధిత ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు మద్దూర్‌నగర్‌లోని వీర నాగేశ్వరరావు అనే వ్యక్తి విక్రయిస్తున్నాడని సమాచారం అందుకున్న ఔషధ నియంత్రణ శాఖ ఏడీ చంద్రశేఖర్‌రావు.. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు అబిద్‌ అలీ, విజయలక్ష్మి, హరిహరతేజల ఆధ్వర్యంలో దాడులకు ప్రణాళిక రూపొందించారు. ముందుగా మద్దూర్‌నగర్‌లో ఓ ఆక్సిటోసిన్‌ బాటిల్‌ను కొనుగోలు చేసి, దానిని ల్యాబ్‌కు పంపించారు. అందులో ఆక్సిటోసిన్‌ మందు ఉందని నిర్ధారణ కావడంతో నాగేశ్వరరావును అరెస్ట్‌ చేసి , అతను చెప్పిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక నంద్యాల రోడ్డులోని ఓ ఇంట్లో తయారవుతున్న ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లను గుర్తించారు. అతని వద్ద పెద్ద ఎత్తున ఆక్సిటోసిన్‌ మందు, ఆక్టిక్‌ యాసిడ్, బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 

ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు విక్రయిస్తే 10 ఏళ్ల జైలు
నిషేధిత ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ప్రసాద్‌పై డ్రగ్స్‌ అండ్‌ కాస్మొటిక్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశాం. నేరం రుజువైతే అతడికి పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉన్న పశువుల దాణాలపై నిఘా ఉంచి దాడులు కొనసాగిస్తాం. ఎవ్వరి వద్దైనా ఇంజెక్షన్లు లభిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. డెయిరీలు, రైతులు ఈ ఇంజెక్షన్లకు దూరంగా ఉండాలి. 
– చంద్రశేఖర్‌రావు, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ

ఆక్సిటోసిన్‌ వల్ల మనుషులకు క్యాన్సర్‌
సాధారణంగా దూడను చూడగానే గేదెకు మిల్క్‌లెట్‌ డౌన్‌ హార్మోన్‌ విడుదలై పాలు విడుస్తుంది. దూడ చనిపోతే పాలు విడవడానికి గేదె ఇబ్బంది పడుతుంది. ఈ కారణంగానే రైతులు దానికి ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు వేసి పాలు పితుకుతారు. గేదెలకు ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్లు వేయడం వల్ల వచ్చిన పాలలో సదరు మందు కూడా ఉంటుంది. ఇది మనిషి శరీరంలోకి వెళ్లి తరచూ వాంతులకు గురికావడం, చర్మంపై కురుపులు రావడం, మరికొందరికి క్యాన్సర్‌ రావడం సంభవిస్తుంది. గేదెలకు కూడా కీళ్ల నొప్పులు వచ్చి అది జీవించే కాలం తగ్గిపోతుంది.  – డాక్టర్‌ సతీష్‌కుమార్, పశువైద్యాధికారి, కర్నూలు

మరిన్ని వార్తలు