పద్మావతి వివాదం.. కోటకు ఊరేసుకుని సూసైడ్‌?

24 Nov, 2017 12:21 IST|Sakshi

జైపూర్‌ : పద్మావతి చిత్రం వివాదం మరో మలుపు తిరిగింది. చిత్ర విడుదలను వ్యతిరేకిస్తూ రాజస్థాన్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నహర్‌గఢ్ కోటకు వేలాడుతున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం ఉదయం స్వాధీనపరుచుకున్నారు. 

అయితే కోట గోడలపై, దగ్గరల్లోని రాళ్ల మీద చిత్ర బృందాన్ని హెచ్చరించిన రాతలు కనిపించాయి. దీంతో ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టు మార్టం నివేదిక తర్వాతే స్పందిస్తామని అధికారులు తెలిపారు.  ఇప్పటికే రాజ్‌పుత్‌ కర్ణి సేన నుంచి చిత్ర విడుదలకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్న సమయంలో ఈ ఘటన మరింత ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌, పంజాబ్‌, యూపీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఈ చిత్ర విడుదలను నిషేధించాయి.

చర్చలకు గ్రీన్‌ సిగ్నల్‌?

మరోవైపు 'పద్మావతి' చిత్ర వివాదం నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రముఖ సినీ నటి, టాక్ షో వ్యాఖ్యాత సిమి గేరేవాల్ నిర్వహించిన మధ్యవర్తిత్వం సత్ఫలితం ఇచ్చినట్లు తెలుస్తోంది. జైపూర్‌లో మహారాణి పద్మినీ దేవితో సిమి  సమావేశమై అభ్యంతరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సినిమా పట్ల వ్యతిరేకత లేదని, సినిమాలోని 'ఘామర్' పాటలో 'పద్మావతి' పాత్రధారి డాన్స్ చేయడం పట్ల మాత్రమే విముఖంగా చూపుతున్నట్లు మహారాణి చెప్పినట్లు సమాచారం. దీనిపై దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో చర్చించేందుకు తాను ఏర్పాట్లు చేస్తానని సిమి ప్రతిపాదించగా, రాణి పద్మినీ దేవి అంగీకరించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. 

మరిన్ని వార్తలు