చిక్కిన పాకిస్థానీ.. అప్పగించాల్సిందే..

23 Sep, 2019 13:19 IST|Sakshi
మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌

ఇక్రమ్‌ కేసు... అదో తంతు!

సైబర్‌ క్రైమ్‌లో చిక్కిన పాకిస్థానీ

ఆ దేశీయుడేనంటూ ధ్రువీకరణ సైతం

చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

విచారణ ముగియగానే పంపేయాల్సిందే

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, ఓ సైబర్‌ నేరానికి పాల్పడి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కిన పాకిస్థాన్‌ జాతీయుడు మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ కేసులో అభియోగపత్రం దాఖలైంది. విచారణ చేపట్టే న్యాయస్థానం అతడు దోషా..? నిర్దోషా..? అనేది తేల్చనుంది. తీర్పు ఎలా ఉన్నా సరే వెలువడిన వెంటనే ఇక్రమ్‌ను సొంత దేశానికి పంపేయాల్సి ఉంది. ఈ నిబంధనల నేపథ్యంలోనే ఆ కేసు ఓ తంతుగా పోలీసులు పేర్కొంటున్నారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి పట్టుబడిన పాకిస్థానీయులను సాధారణంగా ఆ దేశం పట్టించుకోదు. అయితే ఇక్రమ్‌ వ్యవహారంలో మాత్రం అతడు తమ దేశీయుడేనంటూ సమాధానం ఇవ్వడం కొసమెరుపు. 

‘ఆమె’ కోసం వచ్చి బుక్కయ్యాడు....
నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. 12 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్‌ వెళ్లిన ఆముకు అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈ మహిళకు పాకిస్థానీ మహ్మద్‌ ఉస్మాన్‌ ఇక్రమ్‌ అలియాస్‌ మహ్మద్‌ అబ్బాస్‌ ఇక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. తాను భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతను ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలియడంతో ఆమె హైదరాబాద్‌ తిరిగి వచ్చేసింది. దీంతో 2011లో ఉస్మాన్‌ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్‌ వీసాపై వచ్చినట్లు చెప్పాడు. అయితే వాస్తవానికి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన అతడు దుబాయ్‌ నుంచి నేపాల్‌ వరకు విమానంలో..అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అక్కడినుంచి హైదరాబాద్‌ చేరుకున్నాడు. 

సైబర్‌ క్రైమ్‌ కేసులో అరెస్టు...
ఇక్రమ్‌ వచ్చిన ఆరు నెలలకు తర్వాత అతను అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు తెలియడంతో సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షకట్టిన అతను ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్‌లైన్‌లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్‌ మెసేజ్‌ పంపాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు గత ఏడాది జూన్‌లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్‌ పేరుతో అనేక బోగస్‌ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్‌ పాస్‌పోర్ట్‌ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సర్టిఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసినట్లు బయటపడింది. 

ధ్రువీకరించిన పాక్‌ ఎంబసీ ఆఫీస్‌...
ఇక్రమ్‌ను అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్‌ విద్యా సంస్థలో టెన్త్‌ నుంచి డిగ్రీ చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్‌ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్‌ సహా ఇతర గుర్తింపుకార్డులతో పాటు పాక్‌ పాస్‌పోర్ట్‌నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005–08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. వాస్తవానికి ఇక్రమ్‌ 2009 వరకు పాకిస్థాన్‌ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. దీంతో ఇతడి వద్ద ఉన్నవి బోగస్‌ పత్రాలని, వాస్తవానికి పాక్‌ జాతీయుడని నిర్థారించడం కోసం సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఎంఈఏ పాక్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ దేశ రాయబార కార్యాల యం అతడు తమ జాతీయుడే నంటూ ఇచ్చిన జవాబు సైతం ఎంఈఏ ద్వారా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చేరింది.

పక్కాగా చార్జ్‌షీట్‌..
దీనిని ఆధారంగా చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇక్రమ్‌పై అభియోగపత్రాలు దాఖలు చేశారు. న్యాయస్థానంలో కేసు విచారణ పూర్తయిన తర్వాత అతడు నేరం చేశాడా? లేదా? అనేది తేలుతుంది. సాధారణంగా నేరం చేసిన వారిని జైలుకు పంపి, నిరూపితం కాని వారిని  వదిలేస్తారు. అయితే ఇక్రమ్‌ కేసులో మాత్రం ఈ విధానం చిత్రంగా ఉంది. అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందే. ఎంఈఏ నుంచి అందిన ఉత్తర్వులు అలానే ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కోర్టులో కేసు పెండింగ్‌లో లేకుండా డిస్పోజ్‌ అయిన వెంటనే అతడిని తీసుకువెళ్లి ఢిల్లీలోని పాక్‌ ఎంబసీలో అప్పగించాల్సిందే. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ తదితరాలు అవసరం లేకుండా ఇక్రమే నేరం అంగీకరించేలా చేస్తే (ప్లీడెడ్‌ గిల్టీ) వెంటనే కేసు తేలిపోతుందని, ఫలితంగా కోర్టు సమయం, ఇతర వ్యయప్రయాసలు తప్పుతాయని భావించిన అధికారులు డిఫెన్స్‌ లాయర్‌ ద్వారా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్రమ్‌ మాత్రం నేరం అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడంతో విచారణ తప్పనిసరిగా మారింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణ హత్య: సీరియల్‌ సన్నివేశాలే స్ఫూర్తి

కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

మద్యం దొరక్కపోవడంతో వ్యక్తి ఆత్మహత్య!

కరోనా పాజిటివ్‌: ఆ జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్‌

ఆత్మహత్య: ఏం కష్టం వచ్చిందో..? 

సినిమా

‘లాక్‌డౌన్‌ కష్టంగా ఉందా.. ఈ వీడియో చూడు’

‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!!

క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు

అను, అర్జున్‌ల పరిచయం అదిరింది

అంత పెద్ద మొత్తం ఇస్తానన్నపుడు.. : ట్వింకిల్‌

కరోనా ఎఫెక్ట్‌: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నితిన్‌