కార్యదర్శి, సర్పంచ్‌ భర్త బాహాబాహీ..

20 Jul, 2020 09:03 IST|Sakshi

పరస్పరం దాడులు చేసుకున్న ఇరువురు

జనగామ జిల్లా భాంజీపేటలో ఘటన

పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. ఇద్దరిపై కేసు నమోదు 

సాక్షి, రఘునాథపల్లి: అభివృద్ధి పనుల్లో జాప్యంపై సర్పంచ్‌ భర్త, పంచాయతీ కార్యదర్శి పరస్పరం దాడి చేసుకున్నారు. నిధులు డ్రా చేసి పనులు చేయకపోవడంపై నిలదీసినందుకు తనపై దాడి చేశాడని కార్యదర్శి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తనపై అసత్య ప్రచారం చేస్తూ తననే దుర్భాషలాడి దాడి చేశాడని సర్పంచ్‌ భర్త కూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భాంజీపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీరంగరెడ్డి, సర్పంచ్‌ గొరిగె భాగ్య భర్త రవి మధ్య నిధుల విడుదల, తడి పొడి చెత్త వేరు చేసేందుకు సెగ్రిగేషన్‌ షెడ్డు నిర్మాణంలో జాప్యంపై వాగ్వాదం జరిగింది.

ఈ క్రమంలో మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సెగ్రిగేషన్‌ షెడ్డు నిర్మాణం కోసం రూ.1.14 లక్షల నిధులను పంచాయతీ ఖాతా నుంచి డ్రా చేశారని, ఇప్పటికి షెడ్డు నిర్మించకపోవడంతో అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నాడు. అధికారులకు సమాధానం చెప్పలేక సర్పంచ్‌ భర్త రవిని అడిగానని, దీంతో తననే ప్రశ్నిస్తావా అని చొక్కా చింపి దాడి చేశాడని కార్యదర్శి అంటున్నాడు. కాగా, ఇవే విషయాలను ప్రస్తావిస్తూ కార్యదర్శి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నానని, సీసీ రోడ్డు నాణ్యత లేదని గ్రామంలో తనపై దుష్పచారం చేస్తూ కార్యదర్శి అవమానిస్తున్నాడని సర్పంచ్‌ భర్త రవి చెబుతున్నాడు.

సెగ్రిగేషన్‌ షెడ్‌ నిర్మాణానికి అడ్వాన్స్‌గా పంచాయతీ నిధులు తీసుకున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై తాను నెమ్మదిగా సమాధానం చెబుతున్నా వినకుండా తననే దుర్మషలాడుతూ చేయిచేసుకోవడంతో రక్తస్రావం జరగడంతో తాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రవి పేర్కొన్నాడు. అయితే, సర్పంచ్‌ భర్త రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీరంగరెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇరువురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కందుల అశోక్‌కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు